తిరుపతి లడ్డూ కల్తీ వార్త కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసింది. శతాబ్దాలుగా కోట్లాది మంది హిందువులు సందర్శించే తిరుమల తిరుపతి వెంకటేశ్వర దేవాలయంలో స్వామికి సమర్పించే లడ్డూ ప్రసాదంలో ఉద్దేశపూర్వకంగా గొడ్డు మాంసం, పంది కొవ్వు, చేప నూనె కలిపి కల్తీ చేసారని విశ్వహిందూ పరిషత్ ఆందోళన వ్యక్తం చేసింది.
హిందువులు, హిందూ ధర్మం, హిందూ దేవాలయాలపై ఈ నేరం వెనుక ఉన్న దోషులను కనుగొని, ఈ చర్య వెనుక ఉన్న నేరస్తులను కఠినంగా శిక్షించాలని, దానివల్ల హిందువులతో ఆడుకోవడానికి ఎవరూ సాహసించరని పేర్కొంటూ విశ్వహిందూ పరిషత్ ఈ మొత్తం వ్యవహారంపై న్యాయవిచారణకు డిమాండ్ చేసింది.
భవిష్యత్తులో హిందువుల మనోభావాలు, దేవాలయాలను అపవిత్రం చేయడానికి, హిందువుల మతపరమైన మనోభావాలనూ దెబ్బతీసేందుకు చేసిన ఇలాంటి వందలాది చర్యలకు కొనసాగింపుగా తిరుమల ఆలయ బలిదానం జరిగిందని విచారం వ్యక్తం చేసింది. వివిధ లౌకిక ప్రభుత్వాల హయాంలో ఇలాంటి చర్యలు సాధారణ సంఘటనలుగా మారాయని ఆగ్రహం వ్యక్తం చేసింది.
కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాలలో హిందూ మత మనోభావాలను దెబ్బతీసే వందలాది సంఘటనలు జరిగాయని పరిషత్ గుర్తు చేసింది.
శబరిమల అయ్యప్ప ఆలయంలోని ‘అరవణ పాయసం’లో కల్తీకి సంబంధించిన ఇలాంటి సంఘటనలు కనుగొన్నారు, ఒకసారి ప్రసాదంలో బల్లితోక వచ్చింది.
అరుళ్మిగు దండాయుధపాణి ఆలయంలో గడువు ముగిసిన ‘పంచామృతం’ ప్రసాదాన్ని ఆలయ నిర్వాహక మండలి భక్తులకు విక్రయించిన సంఘటన వెలుగుచూసింది. తమిళనాడులోని అధికార పార్టీ, నాస్తికవాద డీఎంకే ‘సనాతన ధర్మాన్ని’ నాశనం చేస్తానని బహిరంగంగా, పదేపదే శపథం చేసింది. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం దేవదాయ శాఖ మంత్రి అలాంటి బెదిరింపులకు ఉత్సాహంగా చప్పట్లు కొట్టడంలో ఆశ్చర్యం లేదు.
వివిధ ఆలయాల పరిపాలనా బోర్డులలో రాజకీయంగా నియమించబడిన వారు విపరీతమైన అవినీతికి పాల్పడుతున్నారు, ఆలయ సంప్రదాయాలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
గురువాయూర్ దేవస్వోమ్ బోర్డు ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధికి రూ.10 కోట్లు విరాళంగా ఇవ్వడం చట్టవిరుద్ధమని కేరళ హైకోర్టు తీర్పు చెప్పిందని, ఆ డబ్బును ఆలయానికి తిరిగి ఇవ్వాలని నాస్తిక కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని కోరిందని పరిషత్ గుర్తుచేసింది.
‘భాగవత సత్రాలు’, భగవద్గీత జ్ఞాన యజ్ఞం’ మొదలైన ఆధ్యాత్మిక ప్రసంగాలను నిర్వహించడానికి హిందూ ఆధ్యాత్మిక, సామాజిక సంస్థలకు క్రమం తప్పకుండా అనుమతి నిరాకరిస్తున్న ప్రభుత్వాలు ఇస్లామిక్ పండుగలు, ఇఫ్తార్ పార్టీలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారని ధ్వజమెత్తింది.
కేరళలో ప్రస్తుతం, ఆలయ పూజారి సమర్పించిన ‘తీర్థం’ నిరాకరించిన వ్యక్తి దేవదాయ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన కింద శబరిమల అయ్యప్ప ఆలయం, గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయం సహా వేలాది ఆలయాలు ఉన్నాయి. అవినీతి, దోపిడీ, దుర్వినియోగం, ఆలయాల వ్యాపారీకరణ, తీర్థయాత్రలు, పవిత్రమైన ఆచారాలను అవమానించడం హిందూ దేవాలయాల ప్రభుత్వ నియంత్రణలో సాధారణ లక్షణంగా మారిపోయాయని విహెచ్‌పి ఆవేదన వ్యక్తం చేసింది.
మదురై మీనాక్షీ సుందరేశ్వరాలయం తూర్పు గోపురం లోపల అగ్నిప్రమాదానికి కారణం రాజకీయ నాయకులు, దేవదాయ శాఖలో రాజకీయదారిలో చేరిన ఉద్యోగులు చేసిన అవినీతి, వ్యాపారీకరణే అని పరిషత్ మండిపడింది. లక్షల హెక్టార్ల దేవాలయ భూములను రాజకీయ నాయకులు, అవినీతి అధికారులు స్వాహా చేస్తున్నారు లేదా వాటి విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని వెల్లడించింది.
తమిళనాడు ప్రభుత్వంలో మంత్రి, స్వయానా ముఖ్యమంత్రి కుమారుడు ఐన ఉదయనిధి స్టాలిన్ హిందూ ధర్మాన్ని నాశనం చేస్తామని బహిరంగంగా ప్రకటించారు. అలాంటి వారిని ఆలయాల దగ్గర అనుమతించకూడదని పరిషత్ డిమాండ్ చేసింది.
సనాతన ధర్మ పరిరక్షణ, పరిపాలన, ప్రచారం కోసం దేవాలయాలను ప్రభుత్వ, అవినీతి రాజకీయ నాయకుల బారి నుండి విడుదల చేసి హిందూ సమాజానికి అప్పగించాల్సిన సమయం ఆసన్నమైందని విశ్వహిందూ పరిషత్ స్పష్టం చేసింది. దీని కోసం విశ్వహిందూ పరిషత్ చట్టపరంగా, ప్రజా చైతన్యం ద్వారా ఉద్యమిస్తోందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు దేవాలయాలను తమ అధీనంలోనుంచి తప్పించి హిందూ సమాజానికి వెంటనే అప్పగించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది.