గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో అపచారం జరిగినందుకు గాను ఉపముఖ్యమంత్రి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. దీక్షలో భాగంగా ఇవాళ విజయవాడలోని ఇంద్రకీలాద్రి వెళ్ళి, మెట్ల మార్గాన్ని శుభ్రం చేశారు. అనంతరం మెట్లకు పసుపురాసి కుంకుమ బొట్లు పెట్టారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించారు. ఎంపీలు బాలశౌరి, కేశినేని శివనాథ్ (చిన్ని), ఎమ్మెల్సీ హరిప్రసాద్ తదితరులు కూడా శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆలయంలో శుద్ధి కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వైసీపీ పాలనలో ఆలయాల్లో తప్పు జరిగిందని చెబితే అపహాస్యం చేసేవారని అన్నారు. అపవిత్రం జరిగిందంటే బాధ్యత ఉన్న వ్యక్తులు సమాధానం చెప్పాలన్నారు. ప్రసాదం తయారీలో ఉపయోగించే పదార్థాల విషయంలో అపవిత్రం జరిగిందంటే చాలా ఆవేదన కలుగుతోందన్నారు.
ప్రాయశ్చిత్త దీక్షను తిరుమలలో అక్టోబర్ 1న పవన్ కళ్యాణ్ విరమించనున్నారు. తిరుపతి నుంచి అలిపిరి మెట్ల మార్గంలో తిరుమలకు నడకదారిన వెళతారు. 2న శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకున్న తర్వాత దీక్ష విరమిస్తారు.