ఈ ప్రపంచంలో మానవాళి విజయం యుద్ధభూమిలో లేదు, సమష్టి శక్తిలోనే ఉంది. ఆ విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావించారు. ప్రపంచ శాంతి, అభివృద్ధి సాధించడానికి అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అవసరమన్నారు. న్యూయార్క్‌లోని ఐరాస జనరల్ అసెంబ్లీలో ‘సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్’ను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.
అంతర్జాతీయ సమాజం ప్రపంచ భవిష్యత్తు గురించి చర్చిస్తున్న వేళ.. మానవ కేంద్రీకృత విధానాలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అదే క్రమంలో తన డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని, ప్రపంచంతో పంచుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు.
సుస్థిరాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూనే మానవ సంక్షేమం, ఆహారం, ఆరోగ్య భద్రత అవసరాన్ని ప్రధాని గుర్తుచేశారు. భారత్‌లో 25 కోట్లమందిని పేదరికం నుంచి బయటకు తెచ్చామని చెప్పారు. భారతీయ గ్రామీణ మహిళలు సుస్థిరాభివృద్ధి సాధిన సులువే అని నిరూపించారని మోదీ చెప్పుకొచ్చారు.