హైదరాబాద్ సంస్థానంలో మెజారిటీగా ఉన్న హిందువుల సామాజిక, ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి పలు రాజకీయ సంస్థలు ఏర్పాటయ్యాయి. 1936లో ఆంధ్రమహాసభ ఏర్పడింది. నిషేధిత భారత కమ్యూనిస్టు పార్టీకి ప్రత్యామ్నాయ సంస్థగా నిలిచింది. అంతకుముందు సిపిఐ తెలంగాణ రైతుల సాయుధ పోరాటానికి నాయకత్వం వహించింది.
అంతకంటె ముందే 1892లోనే ఆర్యసమాజం స్థాపితమైంది. ఐతే నిజాం ప్రభుత్వం 1938 నుంచీ ఆర్యసమాజంపై దాడులు మొదలుపెట్టింది. ప్రభుత్వ అనుమతి లేకుండా యజ్ఞకుండాలు పెట్టకూడదంటూ నిజాం సర్కారు ఆర్యసమాజంపై ఆంక్షలు విధించింది. ఆ ఆంక్షలను వ్యతిరేకిస్తూ 1938లో ఆర్యసమాజం మొదలుపెట్టిన సత్యాగ్రహం ప్రజాదరణ పొందింది. అప్పటినుంచే హైదరాబాద్ సంస్థానంలో ముస్లిం హిందూ వర్గాల మధ్య అంతరాలు పెరగసాగాయి.
హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ 1938 సెప్టెంబర్‌లో స్థాపించారు. అసఫ్‌జాహీ వంశం, నిజాముల సంరక్షణలో బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఉండాలన్నది కాంగ్రెస్ లక్ష్యం. ఆ లక్ష్యాన్ని శాంతియుతంగా, జాతీయ సమైక్యతను ప్రోత్సహిస్తూ, ఈ దేశపు మేధో-నైతిక-ఆర్థిక-పారిశ్రామిక వనరులను నిర్వహిస్తూ, చట్టబద్ధమైన పద్ధతిలో సాధించాలని కాంగ్రెస్ ఉద్దేశం. ఈ లౌకికవాద జాతీయవాద రాజకీయ పార్టీ పేరులోని ‘కాంగ్రెస్’ అనే పదాన్ని – ఆ పార్టీని మతపరమైన లేదా ప్రాంతీయమైన ఉద్యమాల నుంచి వేరు చేయడానికీ, భారత జాతీయ కాంగ్రెసు ‘నిర్మాణాత్మక’ కార్యక్రమాలకు మద్దతు సాధించడానికీ – ఉపయోగించారు.
కాంగ్రెస్ పాత్ర:
నిజాం, ముస్లిం మజ్లిస్, పీడకుడు కాసిం రజ్వీ అందరూ హైదరాబాద్‌ను భారత యూనియన్‌లో కలవకుండా ఆపడానికి, హైదరాబాద్ ప్రజలను మోసం చేయడానికీ తమ శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. హిందువులు, ముస్లిములు ఇద్దరూ తన రెండు కళ్ళ వంటివారని నిజాం ప్రకటించాడు. అతను చాలా తెలివిగా ఒక ప్రకటన చేసాడు. హైదరాబాద్‌ను పాకిస్తాన్‌లో కలిపితే హిందువులు బాధపడతారు, భారత్‌లో కలిపితే ముస్లిములకు నచ్చదు, కాబట్టి ఆ పరిస్థితుల్లో హైదరాబాద్ స్వతంత్రంగా ఉండిపోతేనే మంచిది అని ప్రకటించాడు. అతను తన ఆశయాలను, మతోన్మాదాన్నీ దాచిపెట్టి, హైదరాబాద్ స్వతంత్ర రాజ్యమంటూ ఒక డిక్రీ జారీ చేసాడు. కానీ నిజం దానికి పూర్తి భిన్నంగా ఉంది. హైదరాబాద్‌లో అత్యధిక జనాభాగా ఉన్న హిందువులు తమ ప్రాంతాన్ని మత ప్రాతిపదిక లేని స్వతంత్ర భారత్‌లో కలపాలని, ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడాలనీ భావించారు. ఆ లక్ష్యాన్ని సాధించేందుకు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పార్టీ కష్టపడుతుండేది. నిజాం వాస్తవాలను దాచిపెట్టి, ప్రజల ఆకాంక్షలను అణచివేయడానికి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో తనకు అండగా నిలవడానికి ముస్లిం మతసంస్థ ‘మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ – ఎంఐఎం’ను పోషించాడు. ప్రజల న్యాయబద్ధమైన పోరాటాలను దుర్మార్గంగా అణచివేయడానికి నిజాం తన సైన్యాన్ని మరింత బలోపేతం చేసాడు. 1947 ఆగస్టు 15 నుంచి హైదరాబాద్ కాంగ్రెస్ ప్రజా పోరాటాన్ని తీవ్రతరం చేసింది. సత్యాగ్రహంలో పాల్గొన్న అన్ని పార్టీల వారినీ నిజాం అరెస్ట్ చేసాడు, వారందరినీ తీవ్రంగా అణచివేసాడు. నిజాం పోలీసు బలగాలు, రజాకార్లూ సాధారణ హిందూ ప్రజలపై అసంఖ్యాకమైన దుర్మార్గాలకు పాల్పడ్డారు. కాంగ్రెస్ పోరాటాలను పోలీసు బలగాలు అణచివేసాయి. సత్యాగ్రహులపై లాఠీఛార్జీలు చేసారు, వారు జైల్లో కూడా గాయపడిన సంఘటనలు ఉన్నాయి.
1948 జనవరి 11న నిజాం గూండాలు, రౌడీలను బైటనుంచి నిజామాబాద్ జైల్లోకి పంపించాడు. వాళ్ళు ఆ జైల్లో ఉన్న రాజకీయ ఖైదీలను చితగ్గొట్టి గాయపరిచారు. ఆ ఘోరాలను ఇంకెంతమాత్రం సహించలేని శ్రీ రామాచార్యులు లియాకత్ అలీ మంత్రివర్గానికి రాజీనామా చేసారు. జైళ్ళలో మగ్గుతున్న వేలమంది రాజకీయ ఖైదీలను క్రూరంగా హింసించారు. స్వతంత్ర పోరాటంలో పాల్గొనడం కోసం విద్యార్ధులు పాఠశాలలను బాయ్‌కాట్ చేసారు. ప్రగతివాద భావజాలం కలిగిన ప్రజలు, నాయకుల మీద రజాకార్లు అత్యాచారాలకు పాల్పడ్డారు. లక్షలాది ప్రజలు ప్రాణభయంతో హైదరాబాద్ ప్రొవిన్సును వదిలి ఇతర ప్రాంతాలకు పారిపోయారు. హైదరాబాద్‌లో తమ మానప్రాణాలకు ఆస్తులకూ భద్రత లేనందునే వారు ఆ పని చేసారు. నిజాం పోలీసులు, రజాకార్ల దళాలు ప్రజలను సజీవంగా దహనం చేసేవారు, మహిళలను మానభంగం చేసేవారు, గృహ దహనాలు, దోపిడీలు నిత్యకృత్యాలు. నిజాం సేనలు, రజాకార్ల తుపాకిగుళ్ళు తగిలి వందలాది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. సంస్థానం అంతటా అరాచకం, హింసాకాండతో అల్లకల్లోలంగా ఉండేది. ఆ సంఘటనల గురించి ప్రచురించిన పాత్రికేయ సంస్థలు మూసివేయబడేవి. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో హైదరాబాద్ కాంగ్రెస్ తన కార్యకలాపాలను ప్రొవిన్స్ బైటనుంచి ప్రారంభించింది.
రాష్ట్రీయ స్వయంసేవక్ పాత్ర:
రజాకార్ల ఘాతుకాలు కొనసాగుతుండగానే 1946 ఆగస్టు 4న వరంగల్లు కోటకు ఉత్తర దిశలోని ఒక ఇంటి ఆవరణలో స్వయంసేవకులు నిలబడి ఉన్నారు. ‘‘వారు ‘ఝండా ఊంచా రహే హమారా, విజయీ విశ్వ తిరంగా ప్యారా’ అని పాడుతూ త్రివర్ణ భారత పతాకానికి సెల్యూట్ చేసారు. జాతీయ జెండా గౌరవం కాపాడడం కోసం ప్రాణాలనైనా త్యాగం చేయడానికి సిద్ధమన్నారు. గీతాలాపన తర్వాత ‘ఇంక్విలాబ్ జిందాబాద్’, ‘భారత్ మాతా కీ జై’, ‘మహాత్మా గాంధీకీ జై’ అని విరుచుకుపడ్డారు’’. ‘‘ఇంక్విలాబ్ జిందాబాద్, భారత్ మాతా కీ జై’’ వంటి నినాదాలతో ఓరుగల్లు కోట ప్రతిధ్వనించింది. ఆ జెండా దిమ్మ నుంచి మువ్వన్నెల జెండా ఎగరేసారు.
పోలీసు చర్యకు ముందు రజాకార్ల దోపిడీలకు వ్యతిరేకంగా కొందరు స్వయంసేవకులు పోరాడారు, ఉద్గిర్‌లను రక్షించేందుకు ప్రయత్నించారు. వారి అద్భుతమైన ధైర్యసాహసాలు అనుపమానం. క్రమశిక్షణ గల ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు వంతులవారీగా ధైర్యసాహసాలతో ప్రత్యర్థులను పట్టుకునే ప్రయత్నం చేసారు.