తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో నాణ్యతలేని నెయ్యి ఉపయోగించారనే వివాదంపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మరోసారి స్పందించారు.
నెయ్యి సరఫరా చేసే కంపెనీలకు కనీసం మూడేళ్ళ అనుభవం ఉండాలనే నిబంధనలను గత ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. కనీసం ఏడాది కూడా అనుభవంలేని కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చారని పేర్కొన్నారు.
తిరుమలలో అంత అపచారం జరిగితే అసలు ఏమీ తెలియనట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జగన్ లేఖ రాశారని దెప్పిపొడిచారు.
ఆత్మకూరు పట్టణంలో నిర్వహించిన ‘‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాలతో పరీక్షలు నిర్వహించామన్నారు. అందుల్లో కల్తీ జరిగినట్లు తేలిందన్నారు. జగన్ మోహన్ రెడ్డి సీఎం కావడం కోసం సొంత బాబాయినే హత్య చేశారని, ఇక తిరుమలను దోచుకోమని మరొక బాబాయిని పంపించారని తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ఒక మోసగాడు, బ్లాక్ మెయిలర్ అని ఆయన ఘాటు విమర్శలు చేశారు.