ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై బాంబే ఆర్చ్‌బిషప్ కార్డినల్ ఓస్వాల్డ్ గ్రేసియస్ ప్రశంసలు కురిపించారు. ప్రతీ ఒక్కరి పట్ల మోదీకి ఉన్న శ్రద్ధ కారణంగా మైనారిటీలు కూడా విశ్వాసంగా ఉన్నారని పేర్కొన్నారు.
ముంబైలో ‘ఏక్ పేద్ మా కే నామ్’కార్యక్రమంలో పాల్గొన్న ఆర్చ్‌బిషప్ గ్రేసియస్ మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ ఏ పని చేసినా క్రైస్తవులు సహా ప్రతీ మైనార్టీ సమాజాన్ని దృష్టిలో ఉంచుకుని చేస్తారని భావిస్తున్నామన్నారు. భారతదేశ వైవిధ్యాన్ని ఓస్వాల్డ్ కొనియాడారు.
భిన్న ప్రజలు, సంస్కృతులు, భాషలు, మతాలు కలిగిన భారత్ చాలా గొప్పది అన్నారు. ఇలాంటి దేశం ప్రపంచంలో మరొకటి లేదన్నారు.
ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా ‘సేవా పఖ్వాడ్’ నిర్వహణపై స్పందించిన గ్రేసియస్, మొక్కలు నాటడం, భూమి, ప్రకృతి సంరక్షణ భవిష్యత్తు తరాలకు అందించాలనేది తమ ఉద్దేశం అన్నారు. ప్రధాని మోదీ చెట్ల పెంపకం ఉద్యమాన్ని ప్రోత్సహించడం అభినందనీయమన్నారు.
ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా మహారాష్ట్రలోని క్రైస్తవ సంఘం సేవా పఖ్వాడా అనే కార్యక్రమం చేపట్టింది. ప్రతీ ఏడాది సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు రక్తదానం, హెల్త్ క్యాంపులు సహా వివిధ రూపాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు.