ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ మార్కెట్లో కొబ్బరికాయల ధర రెట్టింపు అయింది. నెల రోజుల వ్యవధిలోనే వెయ్యి కొబ్బరికాయల ధర రూ.9,000 నుంచి రూ.18,000కు చేరింది. దసరా-దీపావళి పండుగల కాలం కావడంతో రూ.20,000 కు చేరొచ్చని రైతులు, వ్యాపారవర్గాలు అంచనా వేస్తున్నారు. దాదాపు ఐదేళ్ళ తరవాత కొబ్బరికి ఈ ధర వచ్చిందని రైతులు చెబుతున్నారు. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళలలో వేర్వేరు కారణాల వల్ల కొబ్బరికాయల దిగుబడులు తగ్గడంతో కోనసీమ కొబ్బరి పంటకు డిమాండ్ పెరిగింది.
కొబ్బరి ఆధారిత ఉత్పత్తులు అయిన కొబ్బరినూనె కిలోగ్రాము దర రూ.320, వర్జిన్ ఆయిల్ ధర కిలోగ్రాము రూ.500కు చేరింది. ఎండుకొబ్బరి క్వింటాలు రూ.15,500గా ఉంది. కొత్తకొబ్బరి, పచ్చికొబ్బరి కాయలు, కురిడీ కొబ్బరికాయల ధరలు కూడా పెరగడంతో రైతుకు మేలు జరగనుంది.
కోనసీమ నుంచి హైదరాబాద్‌కు కొబ్బరికాయల రవాణాకు లారీ కిరాయి రూ.25,000-35,000 వరకు ఉంది. దీంతో ఒక్కో కాయ రవాణాకు రూ.1-1.50 వరకు పడుతుంది.
తెలుగు రాష్ట్రాలతో పాటు ముంబయి, రాజస్థాన్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో పచ్చికొబ్బరికాయలకు డిమాండ్ ఉంది. కురిడీ కొబ్బరికాయలు దిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, హరియాణా రాష్ట్రాలకు ఎగుమతి అవుతాయి. బిహార్, ఉత్తరప్రదేశ్‌తో పాటు మరి కొన్ని రాష్ట్రాల నుంచి వ్యాపారులు కొబ్బరికాయలు కొనుగోలు గోసం కోనసీమకు వస్తున్నారు.