ఉపాధ్యాయులు ఇబ్బంది పెడుతున్నారంటూ పలువురు విద్యార్థులు పరారయ్యారు. ఈ ఘటన పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం వంకాయలపాడులో చోటుచేసుకుంది.
వంకాయలపాడులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన 67 మంది విద్యార్థులు ఈ ఉదయం హాస్టల్ గోడదూకి బయటకు వెళ్ళారు. 67 మంది పారిపోగా ఉపాధ్యాయులు 35 మందిని అడ్డుకున్నారు. మరో 34 మంది సమీపంలోని కొండవీటి కొండలపైకి వెళ్లారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి 16వ నంబరు హైవే పక్కన ఉన్న తుమ్మపాలెం వద్ద విద్యార్థులను గుర్తించారు. అనంతరం పాఠశాలకు తీసుకెళ్లారు.
నరసరావుపేట డీఎస్పీ, చిలుకలూరిపేట రూరల్ సీఐ పాఠశాలకు వెళ్ళి విద్యార్థులతో మాట్లాడారు. ఉపాధ్యాయులు వేధించడంతో పాటు నాణ్యమెన ఆహారం, సరిపడా మంచి నీరు అందించడంలేదని విద్యార్థులు పోలీసులకు తెలిపారు. ఆటలు ఆడుకునేందుకు అవకాశం కల్పించడంలేదని చెప్పారు.
నిజానిజాలను విచారించి విద్యార్థులకు న్యాయం చేస్తామని డీఎస్పీ చెప్పారు. అప్పటివరకు విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని, అనుమతి లేకుండా బయటకు వెళ్లొద్దని సూచించారు.