తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగిన దోషాలకు ప్రాయశ్చిత్తంగా శాంతి హోమం చేసినట్లు టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. ఆలయంలో శాంతి హోమం తో పంచగవ్య ప్రోక్షణ చేశారు.
తిరుమల ఆలయంలోని అన్ని విభాగాల్లో ప్రోక్షణ కార్యక్రమాలు చేసినట్లు ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు వెల్లడించారు. స్వామి వారికి మహా నైవేద్యం పూర్తి చేశామన్నారు. ప్రసాదాల తయారీ కేంద్రాల్లో ప్రోక్షణ చేస్తున్నామన్నారు.
దోషం కలిగిందన్న భావన లేకుండా ఈ కార్యక్రమం చేయడం జరిగిందన్నారు. పూర్ణాహుతి కార్యక్రమంతో అన్ని దోషాలు తొలగుతాయని తెలిపారు. భక్తులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
పవిత్రోత్సవాలకు ముందే నెయ్యి మార్చేశామని తెలిపిన వేణుగోపాల దీక్షితులు, లడ్డూ ప్రసాదం విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదన్నారు. పవిత్రోత్సవాలకు ముందు జరిగిన దోషం, పవిత్రోత్సవాలతో పోయింది. మార్చిన నెయ్యితోనే ఆ తర్వాత ప్రసాదాలు తయారుచేశామని వివరించారు. తెలిసీ తెలియక జరిగిన దోషాలు శాంతిహోమం, ప్రోక్షణతో తొలగుతాయని వేణుగోపాల దీక్షితులు అన్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమలలో లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి, అపచారాలు, అరాచకాలు, అధికార దుర్వినియోగంపై విచారణకు ఐజీ, అంతకంటే పైస్థాయి అధికారి ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజల మనోభావాలతో ఆడుకునే హక్కు ఎవరికీ లేదన్న చంద్రబాబు, ప్రతీ దేవాలయంలో సంప్రదాయాలు, ఆచారాలను గౌరవించాల్సిందేనన్నారు. పాలకమండళ్లలో నేరస్థులు, సంఘవిద్రోహ శక్తులు లేకుండా చూస్తామన్నారు. అందుకు అవసరమైతే ఒక చట్టం కూడా తెస్తామన్నారు.