జనతా విముక్తి పెరమున పార్టీ నేత, వామపక్ష నాయకుడు అనుర దిస్సనాయకే శ్రీలంక అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. దిస్సనాయకే వయస్సు 55 ఏళ్ళు కాగా దేశానికి అధ్యక్షుడైన తొలి వామపక్ష నేతగా ఆయన రికార్డుకెక్కారు. కొలంబోలోని అధ్యక్ష సెక్రటేరియట్లో చీఫ్ జస్టిస్ జయంత జయసూర్య దిస్సనాయకేతో ప్రమాణ స్వీకారం చేయించారు.
మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు తర్వాత దిస్సనాయకే, సమగి జన సంధానయ అభ్యర్థి సజిత్ ప్రేమదాస ఇద్దరూ విజయవానికి అవసరమైన ఓట్లు సాధించలేకపోయారు. దీంతో రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించడంతో దిస్సనాయకే విజయం సాధించారు.
శ్రీలంక నూతన అధ్యక్షుడు దిస్సనాయకేకు భారత ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. భారత హైకమిషనర్ కూడా ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.