అమెరికాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతోంది. నేడు ఆఖరి రోజు పర్యటనలో భాగంగా ఆయన టాప్ టెక్ కంపెనీల సీఈవోలతో సమావేశం అయ్యారు. మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో న్యూయార్క్ లోని స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ లో ఈ సమావేశం జరిగింది.
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, అడోబ్ సీఈవో శంతను నారాయణ్, ఎన్విడియా సీఈవో జెన్సెన్ హాంగ్ సహా 15 టాప్ టెక్ సీఈవోలు రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశానికి సంబంధించిన ఫొటోను మోదీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
సీఈవోలతో ఫలప్రదమైన చర్చలు జరిగాయని, టెక్నాలజీ, ఇన్నోవేషన్ తదితర అంశాల పై సమాలోచనలు జరిగాయన్నారు. వివిధ రంగాల్లో భారత్ సాధించిన ప్రగతి గురించి కూడా మాట్లాడినట్లు చెప్పారు. మేడ్ బై ఇండియా గురించి సమావేశంలో ప్రత్యేకంగా చర్చ జరిగిందని వివరించారు.
అంతకు ముందు క్వాడ్ దేశాల సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ, ఆ తర్వాత ఓ బహిరంగ సభలో ప్రవాసభారతీయులను ఉద్దేశించి మాట్లాడారు. భారత్ అభివృద్ధికి ప్రవాసభారతీయులు రాయబారులుగా వ్యవహరిస్తున్నారని కొనియాడారు.