తిరుమల లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారం మీద ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఐజీ స్థాయి అధికారి పర్యవేక్షణలో నిర్ణీత వ్యవధిలో దర్యాప్తు పూర్తవుతుందని వెల్లడించారు. ఆగమ సలహా మండలి సభ్యుల సూచన మేరకు తిరుమలలో ఇవాళ శాంతిహోమం నిర్వహిస్తున్నామని ప్రకటించారు. వైసీపీ పాలనలో తిరుమల పవిత్రత దెబ్బతిందని, శ్రీవారి సన్నిధిని ప్రక్షాళన చేసి పూర్వ వైభవం తీసుకొస్తామనీ చంద్రబాబు చెప్పారు.
ఆదివారం సాయంత్రం ఉండవల్లిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల వ్యవహారంపై స్పందించారు. ‘‘పవిత్రమైన పుణ్యక్షేత్రంలో గత ఐదేళ్లు అపవిత్ర కార్యక్రమాలు, రాజకీయ నాయకులకు పునరావాసం కల్పించారు. భక్తుల మనోభావాలకు విలువ ఇవ్వలేదు. ప్రసాదంలో నాణ్యత ప్రమాణాలు పాటించలేదు. జరిగిన తప్పులపై గత ఐదేళ్లలో ఎన్నోసార్లు భక్తులు ఆందోళన చేసినా పట్టించుకోలేదు’’ అని మండిపడ్డారు.
‘‘శ్రీవారి లడ్డూ తయారీ విధానానికి 2009లో పేటెంట్ రైట్ దక్కింది. అలాంటి ప్రత్యేకత ఉన్న లడ్డూను గత పాలకులు అధికారంలోకి రాగానే ఇష్టానుసారంగా చేసారు. ట్రస్ట్ బోర్డు నియామకాల్లో గ్యాంబ్లింగ్ చేశారు. చట్టాన్ని మార్చి 50 నామినేటెడ్ పోస్టులు తీసుకొచ్చారు. ఎక్స్ అఫీషియో విధానాన్ని తెచ్చి పెట్టారు. టీటీడీ టికెట్లు ఇష్టానుసారంగా అమ్ముకున్నారు. స్వామిపై నమ్మకం లేని వాళ్లను బోర్డు ఛైర్మన్లుగా పెట్టి అన్యమతస్తులకు ప్రాధాన్యం ఇచ్చారు. రాజకీయ ప్రయోజనాలకు టీటీడీని ఉపయోగించారు’’ అని చెప్పుకొచ్చారు.
‘‘తిరుమలలో నిబంధనలు మార్చారు. నెయ్యి సరఫరాకు డైరీకి మూడేళ్ళ అనుభవం ఉండాలి. దాన్ని యేడాదికి తగ్గించారు. నాలుగు లక్షల లీటర్లు ఉత్పత్తి చేసే డైరీకి అప్పగించాలన్న నిబంధనను ఎవరైనా సరఫరా చేయొచ్చు అనే విధంగా మార్చారు. యేడాదికి కనీస టర్నోవర్ రూ.250 కోట్ల నుంచి రూ.150 కోట్లకు తగ్గించారు. ఈ విధంగా ఇష్టానుసారంగా నిబంధనలు తగ్గించారు. తమిళనాడు నుండి ఏఆర్ డెయిరీని తీసుకొచ్చారు. 10 లక్షల కేజీల ఆవు నెయ్యికి 12.03.2024న ఈ టెండర్ పిలిచారు. 08.05.2024న టెండర్ ఫైనల్ అయింది. కిలో రూ.319.90 ఫైనల్ చేశారు. జూన్ 12 నుండి సరఫరా మొదలు పెట్టారు. 06.7.2024న రెండు ట్యాంకులు, 15.7.2024న మరో రెండు ట్యాంకుల నెయ్యి సరిగా లేదని గుర్తించారు. ప్రక్షాళన మొదలు పెట్టాము. తిరుమలలో అపవిత్ర కార్యక్రమాలన్నీ ప్రక్షాళన చేసి పుణ్యక్షేత్రానికి పూర్వవైభవం తీసుకురావడానికి నాకు భగవంతుడు ఆదేశాలు ఇచ్చారని ఈఓ శ్యామలరావుకు చెప్పాను. తర్వాత నుండి రోజురోజుకు మార్పులు చోటు చేసుకున్నాయి. సరఫరా సరిగా చేయకపోతే హెచ్చరించారు, అయినా వినలేదు. నాలుగు ట్యాంకర్ల నెయ్యిని ఎన్డీడీబీ ల్యాబ్ కు 16.7.2024న పంపిస్తే 23.07.2024న నివేదికలు వచ్చాయి. వాటి ఆధారంగా చర్యలు ప్రారంభించారు. నాణ్యత లేదన్న సంగతి ప్రసాదం తిన్న ప్రతీ ఒక్కరూ చెప్పారు. జంతువుల కొవ్వులు ఉన్నందునే ఫలితాల్లో ఎస్ వ్యాల్యూ ఉండాల్సిన స్థాయిలో లేదు. అవన్నీ చూసాకే ఈవో నోటీసిచ్చి ఆ డైరీని బ్లాక్‌లిస్టులో పెట్టారు’’ అని సీఎం వివరించారు.
‘‘చేసిన తప్పుకు క్షమాపణ చెప్పకుండా మళ్లీ ఎదురుదాడి చేస్తున్నారు. చరిత్రలో ఎప్పుడూ క్షమించరాని నేరం ఇది. భక్తుల మనోభావాల పట్ల గౌరవం ఉంటే ఎదురుదాడి చేస్తారా? మీరు ఎదురుదాడి చేస్తే మంచివాళ్ళని సర్టిఫికెట్ ఇవ్వాలా? వెంకటేశ్వరస్వామికి అపచారం చేసి, నివేదిక తారుమారు చేస్తే సహకరించాలా? సీఎంగా ఉన్నంత వరకు మతసామరస్యం కాపాడటం నా బాధ్యత. నేను నచ్చిన దేవుడికి పూజ చేసుకోవడం నా కర్తవ్యం. వేరే మతాలను నేను ఎప్పుడూ ద్వేషించలేదు’’ అని చెప్పారు.
‘‘గత పాలకుల హయాంలో జరిగిన అపచారాలకు ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త యజ్ఞం ప్రారంభించారు. అన్యాయం జరిగిందంటే మళ్ళీ వెకిలి చేస్తున్నారు. రాజకీయ ముసుగులో ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు. ఇన్ని తప్పులు చేసి మళ్లీ సిగ్గులేకుండా ప్రధానికి లేఖ రాశారు. కేంద్రమంత్రి, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల సిఫార్సులతో టీటీడీ బోర్డు సభ్యులను నియమించామని రాశారు. వాళ్ళేం చేయగలరు? మీ హయాంలో టీటీడీ ఈఓ ఎవరు? ఎక్కడినుండి వచ్చారు? ఇంట్లో ఎవరైనా చనిపోతే యేడాది దాకా తిరుమల వెళ్ళరు. ధర్మారెడ్డి, కొడుకు చనిపోయిన 12వ రోజే వచ్చారు. సోనియా గాంధీ, అబ్దుల్ కలాం తిరుపతి వచ్చినప్పుడు నమ్మకంతో వచ్చామని డిక్లరేషన్ ఇచ్చారు. వాళ్ళకంటె జగన్ గొప్పోడా? ఎందుకు డిక్లరేషన్ ఇవ్వలేదు? టీటీడీ బోర్డు మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భార్య బైబిల్ పట్టుకుని మాట్లాడతారు. భూమన కరుణాకర్ రెడ్డి కూతురు పెళ్ళి క్రైస్తవ సంప్రదాయంలో చేశారు. వాళ్ళే మళ్ళీ ఎదురుదాడి చేస్తారు. నేను కూడా జెరూసలెం వెళ్ళాను. అక్కడి సంప్రదాయాలు పాటించాను. ఒక్కో గుడికి ఒక్కో సాంప్రదాయం ఉంటుంది. ఒక్క టీటీడీ ఛైర్మన్ 3 లక్షల 75 వేల దర్శన లెటర్లు ఇచ్చారు. ఇవన్నీ చూసి షాక్ అయ్యా’’ అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసారు.
కల్తీ నెయ్యి గురించి మాట్లాడుతూ అడల్ట్రేషన్ టెస్టింగ్ చేయాలంటే ఎన్ఏబీఎల్ అక్రెడిటేషన్ ఉన్న ల్యాబ్‌కు వెళ్ళాలి. గత ఐదేళ్ళలో అలాంటి టెస్టులు లేవు. టెండర్ నిబంధనల ప్రకారం కల్తీని పరీక్షించాలి. ఆ పరీక్షలకు అవసరమైన ల్యాబ్‌కు కనీసం రూ.70 లక్షలు ఖర్చు చేయలేకపోయారు. ఇంత అపచారం చేసి కూడా పశ్చాత్తాప పడటం లేదు.’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘కల్తీ ఎందుకు అయిందంటే ఆవులు సరైన దాణా తినలేదు, గడ్డి సరిగా తినలేదు, అనారోగ్యంతో ఉన్నాయి కాబట్టి అలా రిపోర్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. వాళ్ళ అబద్ధాలకు సంఘ బహిష్కరణ చేయాలి. 15 వేల కేజీల నెయ్యి తయారీకి 3.75 లక్షల లీటర్ల పాలు అవసరం. 37 వేల ఆవులకు మంచి గడ్డి, దాణా ఇవ్వలేదు, దాని వల్ల నాణ్యత దెబ్బతింది అని చెప్తున్నాడు. కరుడు గట్టిన నేరస్తులకే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. క్షమాపణ చెప్పకుండా ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. అన్ని ఆవులకు అనారోగ్యం, దాణా సమస్య ఉందా? రామతీర్థంలో రాముడి తల నరికారు…అక్కడ పోరాటానికి వెళ్తే నాపై దాడి, కేసులు పెట్టారు. జగన్ లాంటి వ్యక్తితో రాజకీయం చేయడం జాతికే అవమానం’’ అని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.
తిరుమల ఆలయంలో ఇవాళ శాంతి హోమం చేపట్టారు. పవిత్ర ఉత్సవాలతో దోషాలు తొలగిపోయినా, ఇప్పుడు వెలుగు చూసిన అంశాల వల్ల ఇతర దోషాలు తొలగిపోయేందుకు శాంతి హోమం నిర్వహిస్తున్నామని చెప్పారు. అన్ని దేవాలయాల్లో ఆగమ శాస్త్రాల ప్రకారం సంప్రోక్షణ, శుద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు.
లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారం పై దర్యాప్తుకు సిట్ వేస్తారు. ఐజీ స్థాయి అధికారి పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తున్నారు. నిర్ణీత సమయంలో సిట్ దర్యాప్తు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది.
ఏ మత ప్రార్థనామందిరంలో ఆ మతం వాళ్ళే నిర్వహణ బాధ్యతల్లో ఉండేలా చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు. దానికోసం అవసరమైతే కొత్త చట్టం తెస్తామన్నారు. దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో సంప్రదాయాలకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. దేవాలయాల నిర్వహణపై సమగ్రంగా అధ్యయనం చేసి స్టాండర్డ్ ఆపరేషన్ తయారుచేస్తామని, దానికోసం కమిటీ వేస్తామనీ చెప్పారు. మహిళలకు ప్రత్యేక క్యూల ఏర్పాటు పైనా నిర్ణయం తీసుకుంటామన్నారు.