ఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్యోదంతాన్ని తలపించేలాంటి సంఘటన బెంగళూరులో జరిగింది. మల్లేశ్వర ప్రాంతంలో నివసిస్తున్న 29ఏళ్ళ నేపాలీ మహిళ మహాలక్ష్మి హత్యకు గురైంది. హంతకుడు ఆమె దేహాన్ని 60కి పైగా ముక్కలుగా నరికి, వాటిని రిఫ్రిజిరేటర్లో దాచిపెట్టాడు. అయితే ఆ శరీరభాగాల నుంచి రక్తం కారి, ఫ్రిజ్‌లోనుంచి లీకై బొట్లుబొట్లుగా నేలమీద కారడంతో విషయం బైటపడింది.
విషయం తెలిసిన వెంటనే పోలీసులు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ముందు ఫ్రిజ్‌లోనుంచి మహిళ శరీర భాగాలను బైటకు తీసారు. ఆ పరిసరాల్లో క్రిములు కూడా వ్యాపించాయి. శవాన్ని రికవరీ చేయడానికి బౌరింగ్ ఆస్పత్రి సిబ్బందిని కూడా పిలిపించారు.
మృతురాలు మహాలక్ష్మి భర్త హుకుంసింగ్ రాణా నేలమంగళ ప్రాంతంలో పనిచేస్తాడు. ఆ దంపతులకు నాలుగేళ్ళ కొడుకు ఉన్నాడు. మహాలక్ష్మి, హుకుంసింగ్ దంపతులు సుమారు 7నెలల క్రితం విడిపోయారు. మహాలక్ష్మి ఒక మాల్లో పనిచేస్తోంది. ఆమె ఫోన్ చివరిసారి సెప్టెంబర్ 2న పనిచేసింది. అప్పటినుంచీ స్విచాఫ్‌లోనే ఉంది. దాంతో మహాలక్ష్మి హత్య 20 రోజుల క్రితం జరిగి ఉండొచ్చని పోలీసులు అంచనా వేసారు.
హంతకుడు మహాలక్ష్మి శవాన్ని ముక్కలు చేసి ఫ్రిజ్‌లో పెట్టాడు. దానివల్ల ఆమె హత్య జరిగిందన్న విషయం వెంటనే తెలియరాలేదు. హంతకుడికి పారిపోడానికి తగినంత సమయం దొరికింది. అయితే మృతదేహం కుళ్ళిపోయి, రక్తం బైటకు కారి, అక్కడంతా పురుగులు పట్టి దుర్వాసన వ్యాపించింది. అపార్ట్మెంట్లోని మిగిలినవారు మహాలక్ష్మి తల్లికి చెప్పడంతో నిన్న శనివారం ఆమె ఇంటికి వచ్చి చూసాక అసలు విషయం బైటపడింది. తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
హంతకుడు శవాన్ని దాదాపు 60 ముక్కలు చేసాడు. వాటన్నింటినీ ఒక వరుసలో పెట్టడం, శరీరాన్ని ఒక ఆకారానికి తీసుకురావడం వైద్యులకు సైతం చాలా కష్టమైంది. ఇవాళ పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఆమె భర్తను, ఆమె సోదరిని, ఇతర కుటుంబ సభ్యులను, స్నేహితులను విచారించారు. మహాలక్ష్మి ఫోన్ కాల్‌డేటాను పరిశీలిస్తున్నారు. మరణానికి ముందు మహాలక్ష్మి తరచుగా మాట్లాడిన ఒక వ్యక్తిని పోలీసులు గుర్తించారు. ఇంకా అపార్ట్మెంట్ సమీపంలో సిసిటివి ఫుటేజ్‌ను సేకరిస్తున్నారు. నేరస్తుణ్ణి పట్టుకోడానికి పోలీసులు నాలుగు బృందాలను ఏర్పాటు చేసారు. కేసు దర్యాప్తు జరుగుతోంది.