వనాల సంస్కృతే మన దేశపు సంస్కృతి అని దేశవ్యాప్తంగా ఉన్న వనవాసీ తెగల వారందరూ ప్రపంచానికి చాటిచెప్పాలని అఖిల భారతీయ వనవాసీ కళ్యాణ్ ఆశ్రమ్ జాతీయ అధ్యక్షుడు సత్యేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. దేశాన్ని ముక్కలు చెక్కలు చేయాలన్న విభజన శక్తుల ప్రయత్నాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
‘‘సువిస్తారమైన సనాతన సమాజానికి వనవాసీ సమాజమే పునాది. మనందరి మూలాలూ వనాల్లోనే ఉన్నాయి. ప్రాచీన వేదాల దర్శనంలో ఆనాటి వనవాసీ సమాజమే కీలక పాత్ర పోషించింది. వనవాసుల సంప్రదాయాలు, వేడుకలు, పండుగలు, పూజా విధానాలూ అన్నీ సనాతన సంప్రదాయాలను పోలే ఉన్నాయి. అంటే వన, సనాతన సంప్రదాయాలు రెండూ ఒక్కటే’’ అని సత్యేంద్ర సింగ్ వివరించారు.
‘‘వనవాసీలను భారతదేశం నుంచి విడదీయాలన్న దుర్మార్గమైన కుట్ర బ్రిటిష్ వలస పాలకులదే. వారు మన దేశ చరిత్రను వక్రీకరించి పుస్తకాలు రాసారు. భారతీయ వనవాసీ సమాజానికి కొల్లగొట్టి దాచుకునే లక్షణం లేదు. వారు ప్రకృతి నుంచి తమ అవసరాలకు తగినంత మాత్రమే తీసుకుంటారు. అటువంటి వనవాసీ సమాజాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీదా ఉంది. ప్రస్తుతం సమాజాన్ని అయోమయానికి గురి చేస్తున్న తప్పుడు చర్చల నుంచి సమాజాన్ని రక్షించుకునే దిశలో మన చర్చలు ఉండాలి’’ అని సత్యేంద్ర సింగ్ చెప్పుకొచ్చారు.
సంథాల్ పరగణాకు చెందిన డాక్టర్ రాజ్‌కిశోరీ హన్స్‌డా దేశంలోని వనవాసీ ప్రాంతాల్లో జరుగుతున్న లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్‌ల గురించి వివరించారు. నాగాలాండ్‌కు చెందిన డాక్టర్ తుంబాయ్ జెలియాంగ్ క్రైస్తవ మతంలోకి మారి ఇప్పుడు మళ్ళీ స్వధర్మంలోకి తిరిగి వస్తున్న వనవాసీల అంశాన్ని వివరించారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రామనాథ్ కాశ్యప్ బస్తర్ ప్రాంతంలో మావోయిజం ప్రభావం వల్ల వనవాసీల ప్రాథమిక హక్కులకు ఎలా భంగం కలుగుతోందో వివరించారు.
హర్యానాలోని సమాల్ఖాలో అఖిల భారతీయ వనవాసీ కళ్యాణ్ ఆశ్రమ్ మూడు రోజుల అఖిల భారతీయ కార్యకర్తల సమ్మేళనం నేటితో ముగిసింది. మూడేళ్ళకోసారి జరిగే ఆ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ సర్‌సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్, వివిధ వనవాసీ సమాజాల నాయకులు సహా 2వేలమందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. అండమాన్ నికోబార్ దీవులు, నేపాల్ నుంచి కూడా ప్రతినిధులు వచ్చారు.