మధ్యప్రదేశ్‌లో రైల్వే ట్రాక్‌పై డెటొనేటర్లు:
మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్పూర్ జిల్లాలో సైనిక బలగాలను తీసుకువెడుతున్న రైలును పేల్చివేయడానికి కుట్ర జరిగింది. ఆ రైలు ప్రయాణమార్గంలో పట్టాల మీద కనీసం పది డెటొనేటర్లు పెట్టారని అధికారులు ఇవాళ వెల్లడించారు.
బుధవారం నాడు జమ్మూకశ్మీర్ నుంచి కర్ణాటక వెడుతున్న ప్రత్యేక రైలును లక్ష్యంగా చేసుకుని మధ్యప్రదేశ్‌లోని సగ్ఫటా రైల్వేస్టేషన్ దగ్గరలో డెటొనేటర్లు అమర్చారు. వాటిమీదుగా రైలు ప్రయాణించడంతో ఒక డెటొనేటర్ పేలింది. అప్రమత్తమైన డ్రైవర్, రైలును వెంటనే నిలిపివేసాడు. స్టేషన్ మాస్టర్‌కు సమాచారం అందించాడు. అదృష్టవశాత్తు ఆ సంఘటనలో ఎవరూ గాయపడలేదు.
యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఎటిఎస్), జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ), రైల్వే, పోలీసు విభాగాల సీనియర్ అధికారులు ఆ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లో పట్టాల మీద గ్యాస్ సిలెండర్:
అంతకుముందు, ఈ ఉదయం ఉత్తరప్రదేశ్ కాన్పూర్ చేరువలోని ప్రేమ్‌పూర్ రైల్వేస్టేషన్ దగ్గరలో పట్టాల మీద ఖాళీ గ్యాస్ సిలెండర్ దొరికింది. ఆ మార్గంలో వెడుతున్న గూడ్స్ రైలు లోకో పైలట్, పట్టాల మీద సిలెండర్‌ను చూసి ఎమర్జెన్సీ బ్రేక్స్ వేయడంతో ప్రమాదం తప్పింది.
కాన్పూర్ నుంచి ప్రయాగరాజ్‌కు గూడ్స్ రైలు వెడుతుండగా ఈ ఉదయం 8గంటల 10నిమిషాల సమయంలో ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు చెప్పారు.
‘‘ఆ సిలెండర్ సామర్థ్యం ఐదు కేజీలు. అయితే అది ఖాళీగానే ఉంది. దాన్ని పట్టాల మీద నుంచి తొలగించాము. ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభమైంది’’ అని పోలీసులు వివరించారు.
ఉత్తరప్రదేశ్‌లో ఈ నెలలో ఇది రెండో సంఘటన. సెప్టెంబర్ 8న ప్రయాగరాజ్ నుంచి భివానీ వెడుతున్న కాళింది ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలు తప్పించేందుకు ప్రయత్నం జరిగింది. అప్పుడు కూడా పట్టాలపై గ్యాస్ సిలెండర్‌ను పెట్టారు. దాన్ని గమనించిన డ్రైవర్ ఆపినప్పటికీ, రైలు అప్పటికే సిలెండర్‌ను గుద్దేసింది. అదృష్టవశాత్తు ఆ సంఘటనలో కూడా ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయమూ కలగలేదు.