ఆర్టికల్ 370ని ఏ శక్తీ పునరుద్ధరించలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జమ్మూకశ్మీర్ శాసనసభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాఔరీ జిల్లా నౌషేరాలో పర్యటించారు. ఉగ్రవాదం అంతమయ్యే వరకు పాకిస్తాన్ తో ఎలాంటి చర్చలు జరిపేది లేదని తేల్చి చెప్పారు.
దేశంపై దాడికి పాల్పడిన ఉగ్రవాదులను జైలు నుంచి విడుదల చేయాలని కోరుకునే వారి ఆశలు నెరవేరవని కాంగ్రెస్ ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. భారత ప్రజలపై రాళ్లు రువ్విన వారికి కారాగారం నుంచి విముక్తి కల్పించేది లేదని స్పష్టం చేశారు.
జమ్మూకశ్మీర్ లో ప్రస్తుతం బంకర్ల అవసరం లేదన్న అమిత్ షా, ప్రస్తుతం అక్కడ మన దేశ త్రివర్ణ పతాకం మాత్రమే రెపరెపలాడుతుందన్నారు. కశ్మీర్ లో కాల్పులు జరిపే సాహసం ఎవరూ చేయలేరన్నారు.
జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత మొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. సెప్టెంబరు 18న తొలి విడత పోలింగ్ జరిగింది. సెప్టెంబరు 25న రెండో విడత, అక్టోబరు 1న మూడో విడతలో భాగంగా పోలింగ్ జరగనుంది.