బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్ ఏర్పడిందని, థాయ్ లాండ్ కు ఉత్తరం వైపున మరో సర్క్యులేషన్ ఏర్పడిందని వివరించింది.
ఈ రెండు సర్క్యులేషన్ల కారణంగా అల్పపీడనం ఏర్పడుతుందని భావిస్తోంది. దీని ప్రభావంతో తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర, యానాంలలో వారం పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఈ నెల 23 (సోమవారం) న ఆంధ్రప్రదేశ్, యానాంలో, 23 నుంచి 25 వరకు తెలంగాణలో, 24, 25న రాయలసీమలో భారీ వర్షాలు కురువనున్నాయి. ఉపగ్రహ అంచనాల మేరకు నేటి 5 గంటల తర్వాత రెండు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు కురువనున్నాయి. హైదరాబాద్ లో సాయంత్రం నుంచి రాత్రి వరకు మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది.