అమెరికాలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత పెంచుకునే చర్యలను ఓయో ప్రారంభించింది. హోటల్ చైన్ మోటెల్ 6, స్టూడియో 6 బ్రాండ్లను బ్లాక్‌స్టోన్ రియల్ ఎస్టేట్ నుంచి కొనుగోలు చేయబోతున్నట్లు ఓయో వెల్లడించింది. అమెరికాలో మరింతగా విస్తరించేందుకు ఈ కొనుగోలు దోహదపడుతుందని తెలిపింది.
సుమారు రూ.4,350 కోట్లు నగదు చెల్లించడం ద్వారా కొనుగోలు లావాదేవీ పూర్తవుతుందని తెలిపింది. ఈ ఏడాది నాలుగో త్రైమాసికం(అక్టోబరు-డిసెంబరు)లో కొనుగోలు ప్రక్రియ ముగియనుంది.
మోటెల్ 6 ఫ్రాంఛైజీ నెట్వర్క్ , జీ6 హాస్పిటాలిటీకి 1.7 బి.డాలర్ల (భారత కరెన్సీలో రూ.14,100 కోట్లు) స్థూల గదుల ఆదాయాన్ని సంపాదించి పెట్టనుంది.
2019లో అమెరికాలో అడుగుపెట్టిన ఓయో , 35 రాష్ట్రాల్లో 320కి పైగా హోటళ్లను నిర్వహిస్తోంది. 2023లో అమెరికా పోర్ట్‌ఫోలియోకు సుమారు 100 హోటళ్లతో ఒప్పందం చేసుకున్న ఓయో, 2024లో 250 హోటళ్లను జత చేయాలనుకుంటోంది.