జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావును నియమిస్తూ రాష్ట్రప్రతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రామచంద్రరావు సేవలందిస్తున్నారు.
2012 జూన్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ రామచంద్రరావు విభజన అనంతరం తెలంగాణ ఆప్షన్ ఎంచుకున్నారు. 2021 అక్టోబరు నుంచి 2023 మే వరకు పంజాబ్, హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. పదోన్నతిపై హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు సీజేగా బదిలీ అయ్యారు.
మరో ఏడు హైకోర్టులకు కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్త సీజేలను నియమించారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వెల్లడించారు.
దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ మన్మోహన్‌ను నియమించిన రాష్ట్రపతి, దిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ రాజీవ్ షక్దర్ను హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు సీజేగా పంపింది. దిల్లీ హైకోర్టులోని మరో జడ్జి జస్టిస్ సురేశ్ కుమార్ కెయిత్‌కు మధ్యప్రదేశ్ హైకోర్టు సీజేగా పదోన్నతి కల్పించింది.
కలకత్తా హైకోర్ట్ జడ్జి జస్టిస్ ఇంద్ర ప్రసన్న ముఖర్జీని మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేరళ హైకోర్టు సీజేగా జస్టిస్ నితిన్ మధుకర్ జామ్దార్ను, జస్టిస్ తషి రబ్స్టన్ను జమ్ము కశ్మీర్, లడఖ్ హైకోర్టు సీజేగా నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బాంబే హైకోర్టు జడ్జి జస్టిస్ శ్రీరామ్ కల్పతి రాజేంద్రన్‌కు మద్రాస్ హైకోర్టు సీజేగా పదోన్నతి కల్పించారు.