రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విదేశాల్లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ ఎస్సీ మోర్చా ఇవాళ విజయవాడ ధర్నాచౌక్‌లో నిరసన ప్రదర్శన చేపట్టారు. ధర్నా అనంతరం రాహుల్ గాంధీ దిష్టిబొమ్మతో శవ యాత్ర చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. రాహుల్ గాంధీ దిష్టి బొమ్మని పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో ఎస్సీ మోర్చా నేతలు రాహుల్ గాంధీ ఫ్లెక్సీతో శవయాత్ర కొనసాగించారు. ఆ క్రమంలో పోలీసులు, బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు, కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వివాదం, తోపులాట జరిగాయి.
ధర్నా ప్రదర్శనలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు దేవానంద్ మాట్లాడుతూ ‘‘అమెరికా విశ్వవిద్యాలయంలో ప్రసంగిస్తూ రాహుల్‌గాంధీ తాము అధికారంలోకి వచ్చాక భారత్‌లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్స్ తీసేస్తామంటూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా బీజేపీ నిరసన ప్రదర్శనలు చేస్తోంది. గతంలో కాంగ్రెస్ పాలనలో లక్షలాది దళితులు రోడ్డున పడ్డారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రధాని మోదీ పని చేస్తున్నారు. విదేశీ గడ్డ పైనుంచి భారతీయ దళితులని అణగదొక్కేలా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నాం’’ అన్నారు.
ఆ కార్యక్రమంలో కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ మునిస్వామి కూడా పాల్గొన్నారు. ‘‘విదేశాల్లో భారత్‌ను తక్కువ చేసి మాట్లాడటం సరికాదు. రాహుల్ గాంధీ చైనా, పాకిస్తాన్లకు అనుకూలంగా ఉన్నాడు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న రాహుల్ గాంధీ మీద కేసులు నమోదు చేయాలి. అసలు రాహుల్ ఒక్కడే కాదు, వారి పరివారం మొత్తం రిజర్వేషన్లకు వ్యతిరేకమే. 1956లో నెహ్రూ ఓబీసీలకు వ్యతిరేకంగా మాట్లాడారు. రిజర్వేషన్లు తీసుకునేవారు బుద్ధిహీనులని రాజీవ్‌గాంధీ వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఎస్సీల ఓట్ల కోసం అర్ధిస్తుంది. రిజర్వేషన్ల విషయంలో మాత్రం వ్యతిరేకత చూపిస్తారు. వారికి దళితుల ఓట్లే తప్ప దళితుల అభివృద్ధి అక్కర్లేదు. అలాంటి కాంగ్రెస్‌కు ఇండీ కూటమిలోని మిత్రపక్షాలు సైతం మద్దతు పలుకుతున్నాయి. ఆ కూటమి ఆలీబాబా నలభై దొంగలు లాంటి కూటమి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే అంబేద్కర్ మరణించారు. ఆయనకు రాజ్‌ఘాట్‌లో జాగా ఇవ్వలేదు, కాంగ్రెస్ నాయకుల సమాధులకు మాత్రం ఎకరాలకు ఎకరాలు కేటాయించారు’’ అని మండిపడ్డారు.
బీజేపీ ధర్నా, నిరసన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, జిల్లా బిజెపి అధ్యక్షుడు అడ్డూరి శ్రీ రాం , ఎస్సీ మోర్చా రాష్ట్ర నేతలు మోజీ, సి బాబు, శాంత కుమార్, జయలక్ష్మి, కాళేశ్వరరావు, అంబేద్కర్, విశ్వనాథ్, లెనిన్ బాబు,సాకే శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.