టాలీవుడ్ టాప్ హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన ‘దేవర’ సినిమా టికెట్ల రేట్లను పెంచుకోవడంతో పాటు ఎక్కువ షోలు ప్రదర్శించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతించింది. దీంతో ఏపీ సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
దేవర సినిమా విడుదల కోసం కొత్త జీవోను జారీ చేయడంతో పాటు తెలుగు సినిమాకు నిరంతర మద్దతు తెలుపుతున్న ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు హృదయపూర్వక ధన్యవాదాలు అని ట్వీట్ చేశారు. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ కు కూడా కృతజ్ఞతలు అని తారక్ ట్వీట్ లో పేర్కొన్నారు.
‘దేవర’ సినిమా ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో మేరకు మల్టీప్లెక్స్ లో ఒక్కో టికెట్ పై రూ. 135 వరకు పెంచుకోవచ్చు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అప్పర్ క్లాస్ టికెట్ పై రూ. 110, లోయర్ క్లాస్ టికెట్ పై రూ. 60 వరకు పెంచుకోవడానికి అనుమతి మంజూరు చేసింది. 9 రోజుల పాటు రోజుకు 5 షోలను ప్రదర్శించుకోవచ్చు. సినిమా విడుదల రోజున 6 షోలకు అనుమతించింది.