రాష్ట్రంలో మళ్ళీ వాతావరణ మార్పులు చోటుచేసుకున్నాయి. పదిరోజులుగా పగటి ఉష్ణోగ్రత వేసవిని తలపించింది. తాజాగా నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో వాతావరణంలో మార్పులు జరిగాయి.
ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో సగటున సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలో మీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. దీనికి తోడు అండమాన్ సముద్ర పరిసరాల్లో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. ఇది వాయువ్య దిశగా కదిలి ఈ నెల 23 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.
ఈ మార్పు కారణంగా వచ్చే మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడనున్నాయి. కోస్తా జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయి.
అలాగే దేశంలో నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియకు అనుకూల వాతావరణం ఏర్పడింది. ఈశాన్య రుతుపవన కాలం ప్రారంభమయ్యేందుకు అనుకూల వాతావరణం ఏర్పడుతోంది.