ప్రధాని నరేంద్ర మోదీ, నేడు అమెరికా పర్యటనకు వెళ్ళారు. శనివారం తెల్లవారుజామున దిల్లీ నుంచి అమెరికాకు పయనం అయ్యారు. పర్యటనలో క్వాడ్ సమ్మిట్‌లో ప్రధాని పాల్గొంటారు. పలు ద్వైపాక్షిక సమావేశాలతో అమెరికాతో చర్చించడంతో పాటు ప్రవాసభారతీయులతో భేటీ కానున్నారు.
పర్యటనకు బయల్దేరడానికి ముందు సోషల్ మీడియాలో ప్రధాని మోదీ ప్రకటన విడుదల చేశారు. ‘‘అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్వస్థలమైన విల్మింగ్టన్లో నిర్వహించే క్వాడ్ సమ్మిట్‌కు హాజరుకావడంతో పాటు గే న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో భవిష్యత్తు శిఖరాగ్ర సమావేశంలో ప్రసంగించేందుకు ఎదురుచూస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.
క్వాడ్ సమ్మిట్‌లో అమెరికా అధ్యక్షడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్, జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిడాతో క్వాడ్ సమ్మిట్‌లో కలుస్తానిని తెలిపారు. శాంతి, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పురోగతి, శ్రేయస్సు కోసం క్వాడ్ పని చేస్తుందని వివరించారు.
అమెరికా ప్రెసిడెంట్ బైడెన్‌తో సమావేశం భారత ప్రజల ప్రయోజనం, ప్రపంచ ప్రయోజనాల కోసం కొత్త మార్గాలను సమీక్షించడానికి, గుర్తించడానికి వీలు కల్పిస్తుందని ఆకాంక్షించారు.
ప్రధాని మోదీ సెప్టెంబర్ 21 నుంచి 23 వరకు మూడు రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 21న డెలావేర్‌లోని విల్మింగ్టన్లో జరిగే ఆరో క్వాడ్ లీడర్స్ సమ్మిట్‌కు హాజరవుతారు. ఆ తర్వాత 22న న్యూజెర్సీలో భారతీయ సమాజానికి సంబంధించిన కార్యక్రమానికి హాజరవుతారు. 23న ఐక్యరాజ్యసమితి నిర్వహించే ‘సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్’లో పాల్గొంటారు.