వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించారనే ఆరోపణలపై ఏపీ మాజీ సీఎం, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందనేది టీడీపీ సృష్టించిన కట్టు కథ అన్నారు. దశాబ్దాలుగా జరుగుతున్న పద్ధతుల్లోనే తిరుమలలో లడ్డూ తయారీ జరుగుతోందని అన్నారు.
దేవుడిని కూడా రాజకీయాల్లో లాగే దుర్మార్గమైన మనస్తత్వం చంద్రబాబుది అని విమర్శించారు. భక్తుల మనోభావాలతో ఆడుకోవడం ధర్మమేనా? అని ప్రశ్నించారు. ప్రతీ ఆరు నెలలకు నెయ్యి సరఫరా కోసం టెండర్లు పిలుస్తారని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే నెయ్యి శాంపిల్స్ తీసుకున్నారని, జులై 23న రిపోర్ట్ వస్తే ఇప్పుడు మాట్లాడడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు.
జులై 17న ఎన్డీడీబీకి నెయ్యి శాంపిల్స్ పంపించారని, జులై 23న రిజెక్ట్ చేస్తే చంద్రబాబు ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదన్నారు. జరగనిది జరిగినట్టు చంద్రబాబు చెబుతున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీ ట్యాంకర్ సర్టిఫికెట్ తీసుకోవాలని,ప్రతీ ట్యాంక్ శాంపిళ్ళను మూడుసార్లు టెస్ట్ చేస్తారని చెప్పారు.అబద్ధాలను ప్రచారం చేయడం ద్వారా తిరుమల పవిత్రతను దెబ్బతీయడం సరికాదని హితవు పలికారు.
లడ్డూ ప్రసాదం వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీకి, సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తానని వెల్లడించారు.చంద్రబాబు 100 రోజుల పాలనపై ప్రజల దృష్టి మళ్లించడానికే ఈ వ్యవహారం అని మండిపడ్డారు.