దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త గరిష్ఠాలను నమోదు చేశాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించడం మార్కెట్లలో రెండో రోజూ జోష్ నింపింది. ప్రారంభం నుంచి లాభాలతో మొదలైన స్టాక్ సూచీలు, చివరకు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1359 పాయింట్ల లాభంతో 84544 వద్ద ముగిసింది. నిఫ్టీ 375 పాయింట్లు పెరిగి, 25790 వద్ద ముగిసింది. మదుపరుల సంపద ఒకే రోజు రూ.6 లక్షల కోట్లు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లు కూడా దూసుకెళుతున్నాయి.
ఇండెక్స్ 30లో అన్నీ షేర్లూ లాభాల్లో ముగిశాయి. టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్‌బిఐ, బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, ఎల్ అండ్ టీ, టైటన్ కంపెనీల షేర్లు లాభాలార్జించాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.54 వద్ద ముగిసింది. ముడిచమురు ధర స్వల్పంగా పెరిగి 74 యూఎస్ డాలర్ల వద్ద ట్రేడవుతోంది.బంగారం ధరలు మరోసారి భగ్గుమన్నాయి. తాజాగా ఔన్సు స్వచ్ఛమైన బంగారం 2633 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.