కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తూర్పార బట్టారు. కాంగ్రెస్ అంటేనే మోసం, అసత్యాలని దుయ్యబట్టారు. అధికారమిస్తే రుణమాఫీ చేస్తామని తెలంగాణలో హామీ ఇచ్చి మోసం చేసిందని విమర్శించారు. తెలంగాణలో రైతులకు రుణమాఫీ చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఎన్నికల వాగ్దానం నెరవేర్చకుండా రైతులను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహారాష్ట్రలోని వార్ధాలో పర్యటించిన ప్రధాని మోదీ, కాంగ్రెస్ పార్టీలో దేశభక్తి లోపించిందన్నారు. విదేశీ గడ్డపై కాంగ్రెస్ నేతల ప్రేలాపనలు వింటే బాధేస్తోందన్నారు. సమాజాన్ని విచ్ఛిన్నం చేయడం, దేశ సంస్కృతిని అవమానపరచడమే లక్ష్యంగా దేశ వ్యతిరేక అజెండాతో కాంగ్రెస్ ముందుకెళుతుందని ఆరోపించారు.
తుక్డే తుక్డే గ్యాంగ్, అర్బన్ నక్సల్స్ తో కాంగ్రెస్ పార్టీ నడుస్తుందని అన్నారు. దేశంలో అత్యంత అవినీతి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీయేనని పునురుద్ఘటించారు. దేశంలో అత్యంత అవినీతి కుటుంబం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ రాజ కుటుంబమేనని విమర్శలు గుప్పించారు. అవినీతి, కుంభకోణాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలను మించిన వారెవరూ లేరని దెప్పిపొడిచారు.