తిరుపతి లడ్డూల తయారీలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందన్న వార్తలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. దాంతో ఆ ఆరోపణలపై కేంద్రప్రభుత్వం సైతం స్పందించింది. నెయ్యిలో జంతువుల కొవ్వు ఆరోపణలకు సంబంధించి సమగ్ర నివేదిక సమర్పించాలంటూ కేంద్ర ఆరోగ్య మంత్రి జెపి నడ్డా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరారు.
కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆ సంఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ముఖ్యమంత్రి చెప్పిన విషయం చాలా ఆందోళనకరం. దానిపై సమగ్ర విచారణ జరపాలి, దోషులను కఠినంగా శిక్షించాలి అని ప్రహ్లాద్ జోషి అన్నారు.
వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు తిరుపతి లడ్డూల తయారీకి కావలసిన నెయ్యిని సరఫరా చేసే కాంట్రాక్టర్లు పంపిస్తున్న నెయ్యి నమూనాలను జులై నెలలో పరీక్షింపజేసారు. గుజరాత్లోని ప్రభుత్వ ప్రయోగశాలలో చేసిన పరీక్షలో ఆ నెయ్యిలో చేప నూనె, గొడ్డు కొవ్వు, పంది కొవ్వు ఉన్నాయని వెల్లడైంది.
తెలుగుదేశం, జనసేన పార్టీలు స్వామివారికి, సనాతన ధర్మానికీ తీవ్రమైన అపచారం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేసాయి. బీజేపీ నాయకుడు, కేంద్రమంత్రి అయిన బండి సంజయ్ జరిగిన సంఘటనను క్షమించరాని పాపంగా అభివర్ణించారు. టిటిడిలో ఇతర మతాలకు చెందిన వారికి కూడా చోటు కలిగించిన ఫలితమే ఇలాంటి దుర్మార్గాలకు కారణమని ఆయన ఆరోపించారు.
టిటిడి మాజీ సభ్యుడు, బిజెపి నాయకుడు భానుప్రకాష్ రెడ్డి ఈ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద పోలీస్ కంప్లయింట్ ఇవ్వాలని డిమాండ్ చేసారు.