భైరవునిపల్లి గ్రామస్తులపై విజయం సాధించి ఆ గ్రామాన్ని సర్వనాశనం చేసాక నిజాం ప్రభుత్వ అధికారులు, నిజాం సైన్యం పాల్పడిన అమానుష దుష్కృత్యాలకు అంతేలేదు. ఒక పెద్ద విప్లవాన్ని అణచివేసిన వారిలా నిజాం అనుచరులు సంబరాలు జరుపుకున్నారు. వారు గ్రామంలోని ప్రతీ ఇంటినీ సోదా చేసారు. యువకులను బంధించారు. ఆడవారిని చెరిచారు, అన్ని ఇళ్ళనూ లూటీ చేసారు. గడ్డి, పశుగ్రాసం అంతా తగులబెట్టేసారు. నిజాం ప్రభుత్వ సైన్యానికీ, మతోన్మాదులకూ తేడా లేనట్లే ప్రవర్తించారు. గ్రామంలోని మొత్తం 92మంది యువకులను ఊరి చివరికి లాక్కొచ్చారు. వారిలో ఇద్దరు పెద్దవయసు వారు కూడా ఉన్నారు. వారందరినీ వరుసగా నించోబెట్టి నిజాం సైనికాధికారులు తమ విద్యను పరీక్షించుకున్నారు. తమ రైఫిళ్ళతో ఒకసారి కాలిస్తే ఎంతమంది చనిపోతారు అన్నది వారు పెట్టుకున్న పరీక్ష. యువకులను బలిచ్చే గొర్రెల్లా తాళ్ళతో కట్టేసారు, వారిని నాలుగు వరుసల్లో ఒకరి వెనుక ఒకరిని నిలబెట్టారు. మొదట ఒక ఆర్మీ అధికారి కాల్పులు ప్రారంభించాడు. అతని తూటా నలుగురు యువకుల శరీరాల్లోకి దూసుకుపోయింది. ఆ నలుగురూ అక్కడికక్కడే నేల కూలారు. తర్వాత పోలీస్ అధికారి కాల్చిన తూటా ముగ్గురు యువకులను బలితీసుకుంది. ఆ తర్వాత సాధారణ అధికారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. భైరవునిపల్లి గ్రామస్తులపై పగతో రగిలిపోతున్న భువనగిరి డిప్యూటీ కలెక్టర్ హషీమ్ ఎనిమిది మందిని కాల్చిచంపేసాడు. ఇద్దరు పెద్దవాళ్ళు మినహా యువకులందరినీ వారు స్టన్గన్స్తో కాల్చి హతమార్చారు. రజాకార్ సైన్యాధ్యక్షుడు కాసిం రజ్వీ ప్రధాన సహచరుడు మొహాజ్జిమ్ హుస్సేన్ ఆ దారుణ మారణకాండలో ప్రధాన పాత్ర పోషించాడు. తర్వాత వాళ్ళు గ్రామంలోని హరిజనులను పనిలిపించారు. మొత్తం 90 శవాలనూ ఒక బావిలో పడవేయించారు. నిజాం తొత్తులు గ్రామంలో చంపేసిన వారిని ఈ ఊచకోతలో లెక్కపెట్టలేదు. ఆ ఉదయం సుమారు 11 గంటల సమయానికి నిజాం సైన్యం వెనక్కు తిరిగివెళ్ళింది. ఆ క్రమంలో వారు కుటిగల్ గ్రామాన్ని దాటారు. ఆ పల్లెటూళ్ళో 25మందిని చంపేసారు. మృతుల్లో ఆ గ్రామ పట్వారీ నరసింహారావు కూడా ఉన్నాడు.
భైరవునిపల్లి, లింగాపూర్ గ్రామాల్లో నిజాం సైన్యం దౌర్జన్యాలు, ఊచకోతలను చూసిన జనగామ ప్రజలు నిజాం ప్రభుత్వాన్ని ద్వేషించారు. అయితే నిజాం వేలాది రూపాయలు ఖర్చుపెట్టి విదేశాల నుంచి పాత్రికేయులను తీసుకొచ్చి భైరవునిపల్లి ఊచకోత ఘటన చరిత్రను వక్రీకరింపజేసాడు. అక్కడ తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హిందువులు సాయుధ పోరాటానికి పాల్పడ్డారనీ, ఆ సమయంలో శాంతి భద్రతల పరిరక్షణకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందనీ రాయించాడు. అయినప్పటికీ నిజాం అమానుష చర్యలు, అమాయక ప్రజల ఊచకోతతో జరిగిన రక్తపాతం గురించి నిజాలు ప్రజలకు తెలిసాయి.
నిజాం తన పాలనలోని గ్రామాలను ఎలా దోచుకున్నాడో, ఆ గ్రామస్తులను ఎలా దరిద్రులను చేసాడు అన్న సంగతిని గొర్త గ్రామానికి చెందిన 80యేళ్ళ వృద్ధుడు వంకే వీరశెట్టప్ప కొన్నాళ్ళక్రితం వెల్లడించాడు. 1928 నుంచి 1948 వరకూ 20యేళ్ళపాటు నిజాం హిందువులను బానిసలుగా చేసాడు, వారి శ్రమను దోచుకున్నాడు. తిరగబడినవారిని చంపేసారు. గొర్తలో మొదటిసారి ప్రతిఘటించినందుకు వీరశెట్టప్ప యేడాది పాటు జైల్లో మగ్గిపోయాడు. నిజాం ఎప్పుడైతే తాను స్వతంత్రంగా పరిపాలిస్తాను అని ప్రకటించాడో, ఆ క్షణం నుంచీ ప్రతీ ముస్లిమూ ఒక రాజులా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ప్రత్యేకించి అధికారంలో ఉన్నవారైతే నియంతలుగా మారిపోయారు, తోటి గ్రామస్తులను అణగదొక్కసాగారు. హుయానాబాద్, కళ్యాణ్, బాల్కి, రాజేశ్వర్, ఘోడావాడి, సైగావ్, మోహేకర్ తదితర గ్రామాల్లో ముస్లిం అధికారులు హిందువులను వేధించడం, దోచుకోవడం, ఆఖరికి చంపడం కూడా మొదలుపెట్టారు.
వారు మొదట హిందువుల ఇళ్ళలోకి దూరతారు. ఇంటిలోని మగవాళ్ళను బైటకు లాక్కొచ్చి చంపేస్తారు. తర్వాత ఆడవాళ్ళు, ఆడపిల్లలపై అత్యాచారాలు చేస్తారు. ఆ హింసాకాండ వర్ణనాతీతం. ఒక సంఘటనలో ఒక ఇంట్లో మగవాళ్ళందరినీ పొడిచి చంపేసారు. చివరిగా కుటుంబంలోని చిన్నవయస్కుడైన తమ్ముణ్ణి ఈడ్చారు. గర్భవతి అయిన అతని అక్కగారు ఆ పిల్లవాడి మీద అడ్డంగా పడిపోయింది. అతన్ని చంపొద్దంటూ ఏడ్చింది. ఆ క్రూర హంతకులు ఆమెను పొట్ట మీద విపరీతంగా తన్నారు. ఆమె అక్కడికక్కడే బిడ్డను కని చనిపోయింది. ఆ బిడ్డ తల్లి లేని అనాథలా పెరిగాడు. ఆ రోజుల్లో పరిపాలన అంటే దుర్మార్గమే అన్నట్లుండేది. వాళ్ళకు కనిపించిన ప్రతీ మహిళనూ అత్యాచారం చేసారు. వారి ఘాతుకాలను అడ్డుకునేవాడే లేకుండా పోయాడు.
గొర్త గ్రామంలో ఒక్కరోజు 50మంది పురుషులను హత్య చేసారని వంకే వీరశెట్టప్ప వెల్లడించాడు. వారిలో కొందరి పేర్లు – అనిరుద్ధప్ప, ములుశెట్టి, జగబెట్టి, శివప్ప, ధన్గర్, శివప్ప మైత్రి, మారుతి అప్పాకోనే, ధోలప్ప కానాజీ, రామారావు పతాజే, గురప్ప కానాజీ, భీమన్న రాజోలె, శరణప్ప కనకటి, చిన్నప్ప బరాదరీ, గురప్ప బరాదరీ, కాశప్ప మధుకంటి, విరూపాక్షప్ప మతాపతి, బసవప్ప వంకే.
నిజాం ఆశయం ఒకటే. ‘ఇస్లామ్ అసఫియా సామ్రాజ్యాన్ని’ స్థాపించాలన్నదే అతని లక్ష్యం. 1947 తర్వాత అతను స్వతంత్రం ప్రకటించుకుని, తనను తాను ‘హిజ్ మెజెస్టీ ది నిజామ్’ అని ప్రకటించుకున్నాడు. అత్యంత భయంకరమైన అణచివేత పరిపాలకుడు నిజామే. నిస్సహాయులైన హిందువుల మీద అత్యంత క్రూరమైన హేయమైన హింసకు పాల్పడేవాడు. కొత్తగా స్వతంత్రం పొందిన భారతదేశంలో తానొక స్వతంత్ర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని భావించాడు. తన ఏలుబడిలోని ప్రాంతంలో ముస్లిం మత ప్రభావాన్ని పెంచేసాడు. దానికి వ్యవస్థాగత మద్దతును ఇత్తేహాదుల్ ముస్లిమీన్ అందించింది. నిజాం పాలనను రజాకార్లు తమ హింసాకాండ, అత్యాచారాలతో కాపాడుకొచ్చారు. అప్పటి బ్రిటిష్ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్ కూడా ‘స్వతంత్ర హైదరాబాద్’కు మద్దతు పలికాడు. ఐరోపాలో స్విట్జర్లాండ్‌లా భారత్‌లో హైదరాబాద్ ఒక ‘బఫర్ స్టేట్’గా ఉండగలదని ఆశించాడు.
రజాకార్ల కమాండర్ కాసిం రజ్వీ క్రమంగా నిజాంకు పెద్ద సమస్యగా తయారయ్యాడు. ప్రపంచంలో గొప్ప సైన్యాధ్యక్షులుగా చరిత్ర పుటలకెక్కిన వారి జాబితాలో తాను కూడా ఒకడినని కాసిం రజ్వీ భావించసాగాడు. అతను భారతదేశపు ఉక్కుమనిషి సర్దార్ పటేల్‌ను కలిసి, హైదరాబాద్ స్వతంత్ర రాజ్యంగా ఉంటుందని బీరాలు పలికాడు. ‘ఆత్మహత్య చేసుకునే వాళ్ళను ఎవరూ ఆపలేరు’ అంటూ పటేల్ దానికి చాలా క్లుప్తంగా జవాబిచ్చారు. రజ్వీ హైదరాబాద్ సంస్థానంలోని ముస్లిములను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేసాడు. దేశ రాజధాని ఢిల్లీనే పట్టుకుంటామనీ, ఎర్రకోట మీద ఇస్లామిక్ అసఫియా జెండా ఎగరేస్తామనీ గప్పాలు చెప్పుకున్నాడు. కానీ భారత సైన్యం హైదరాబాద్‌లోకి ప్రవేశించిన మూడే మూడు రోజుల్లో నిజాం సైన్యం, రజాకార్లు తమ ఆయుధాలు కింద పడేసి లొంగిపోయారు. నిజాం మొత్తం తప్పంతా కాసిం రజ్వీ, రజాకార్ సేనదే అంటూ భారత్‌కు లొంగిపోయాడు.
పోలీస్ చర్య తర్వాత కాసిం రజ్వీని విచారించడానికి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసారు. సామూహిక హంతకుడు, దోపిడీదారుగా అతన్ని బోనెక్కించారు. న్యాయస్థానం అతనికి ఏడేళ్ళ కఠిన కారాగార శిక్ష విధించింది. సాధారణ న్యాయవాది నుంచి నీచుడైన సైన్యాధికారిగా, తనను తాను ఫీల్డ్‌మార్షల్‌గా ప్రకటించుకున్న కాసిం రజ్వీ చివరికి లూటీలు చేసే దోపిడీదొంగగా తన నిజరూపాన్ని చూపించుకోవలసి వచ్చింది. నిఘా విభాగం అధిపతి నర్సింగ్ ప్రసాద్ అద్భుత కృషి కారణంగా రజ్వీని స్పష్టమైన సాక్ష్యాధారాలతో దోషిగా నిరూపించారు. అతను కఠినమైన శిక్ష అనుభవించవలసి వచ్చింది.