సనాతనధర్మంపై దాడి అంటూ ఆగ్రహం
తిరుమలలో లడ్డూ తయారీలో జంతువులు కొవ్వు వాడారనే ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై రామజన్మభూమి ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ స్పందించారు. ఈ ఘటనను సనాతన ధర్మంపై జరిగిన కుట్రగా ఆయన అభివర్ణించారు.
ఓ నేషనల్ మీడియా చానల్ తో మాట్లాడిన సత్యేంద్ర దాస్, తిరుమల బాలాజీ అంటే ప్రజలకు ఎంతో నమ్మకం అన్నారు. దేశ, విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి వెళతారని లడ్డూను ప్రసాదంగా స్వీకరిస్తారని అన్నారు.
లడ్డూ ప్రసాదం తయారీలో చేపనూనె కలిపినట్లు తేలడం దారుణం అన్నారు. దీనిని సనాతన ధర్మంపై జరిగిన కుట్ర, దాడిగా భావిస్తున్నామని అన్నారు. ఈ అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి విచారణ జరపాలని కోరారు. దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.