గత వైఎస్ఆర్‌సిపి హయాంలో తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రసాదంగా ఇచ్చే లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వులు ఉన్నాయని తేలింది. గుజరాత్‌కు చెందిన నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ కాఫ్ లిమిటెడ్ సంస్థ ప్రయోగశాలలో చేసిన పరీక్షలో చేప నూనె, గొడ్డు కొవ్వు, పంది కొవ్వు వాడిన కల్తీ నెయ్యిని లడ్డూల తయారీలో ఉపయోగించారని నిర్ధారణ అయింది. దాంతో హిందూ సమాజం ఆగ్రహావేశాలకు అంతు లేకుండా పోయింది.
జగన్ పరిపాలనా కాలంలో తిరుపతి ప్రసాదాల తయారీకి, జంతువుల కొవ్వుతో తయారుచేసిన కల్తీ నెయ్యిని వాడారని బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. దాంతో ఒక్కసారిగా కలకలం రేగింది. వైసీపీ నాయకులు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర రెడ్డి తదితరులు ఎన్డీయే కూటమి ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికే అటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. అయితే, గురువారం సాయంత్రం ఎన్‌డిడిబి కాఫ్ లిమిటెడ్ సమర్పించిన నివేదిక వివరాలను టిడిపి అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి వెల్లడించారు.
‘‘వైసీపీ హయాంలో నెయ్యి, జీడిపప్పు, బాదంపప్పు, తదితర పదార్థాలు నాసిరకం వాటిని ఉపయోగించడం వల్ల లడ్డూల నాణ్యత పడిపోయిందన్న విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. భక్తులు ఎన్నోసార్లు ఈ అంశంపై నిలదీసారు. లడ్డూల తయారీకి టీటీడీకి రోజుకు 15 వేల కేజీల నెయ్యి అవసరం. కర్ణాటకకు చెందిన నందిని కోపరేటివ్ డెయిరీ స్వామి వారి మీద భక్తితో రాయితీ మీద తక్కువ రేటుకు నెయ్యి సరఫరా చేస్తున్నా కమిషన్లు రావనే ఉద్దేశంతో ఆ సంస్థను పక్కనపెట్టి కక్కుర్తితో ఇతర సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు. తక్కువ ధరకే నెయ్యి సరఫరా చేస్తామంటూ ముందుకొచ్చిన కొన్ని సంస్థలతో, వాటి గురించి ఎటువంటి విచారణా జరపకుండానే, ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ సంస్థలు నాసిరకపు నెయ్యిని రూ.320కి సరఫరా చేసాయి.’’
‘‘నేతి నాణ్యతను పరిశీలించేందుకు 2024 జులై 8న ఎన్‌డిడిబి కాఫ్ ల్యాబ్‌కు నమూనాలు పంపించారు. వాటిని ప్రయోగశాల పరిశీలించి జులై 16న నివేదిక ఇచ్చింది.ఆ నేతిలో సోయాబీన్, పొద్దుతిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మొక్కజొన్న, పత్తిగింజలతోపాటు చేప నూనె కూడా వాడినట్లు స్పష్టమైంది. వీటితోపాటు గొడ్డు కొవ్వు, పామాయిల్, పంది కొవ్వు కూడా వాడారు. ఆ నేతిలో ఎస్-విలువ ఉండాల్సిన దానికన్నా చాలా తక్కువ ఉంది. దానికి కారణం జంతువుల కొవ్వు కలవడమేనని ల్యాబ్ నిర్థారించింది. సప్లయ్ దారులు సరఫరా చేసే నెయ్యి నాణ్యతను కూడా పరిశీలించకుండా గత ప్రభుత్వం ఇష్టానుసారంగా లడ్డూల వినియోగానికి ఉపయోగించింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెయ్యి నాణ్యతను పరిశీలించడానికి ల్యాబ్‌కు పంపగా వచ్చిన నివేదికలో వివిధ రకాల నూనెలు అందులో ఉన్నట్లు నిర్థారణ అయింది. తమిళనాడుకు చెందిన ఏఆర్ ఫుడ్స్ సప్లయ్ చేసిన నేతిని ఎన్‌డిడిబి ల్యాబ్‌కు పంపితే అందులో వెజిటబుల్ ఆయిల్ ఉన్నట్లు నిర్థారించారు. వెంటనే టీటీడీ ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టింది’’ అని ఆనం వెంకట రమణారెడ్డి వెల్లడించారు.
ఈ విషయం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. కేవలం దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ పరమ పవిత్రంగా పరిగణించే తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వులతో తయారైన కల్తీ నేతిని ఉపయోగించారన్న వార్త హిందువులందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి, ఆగ్రహావేశాలకూ గురి చేసింది. ప్రభుత్వం ఆ సంఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.