దేశంలో వరుస రైలు ప్రమాదాలకు పాల్పడటానికి చేస్తోన్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్లు, పెద్ద బండరాళ్లు వెలుగు చూడగా, తాజాగా 6 మీటర్ల పొడవైన ఇనుప స్తంభం ఉంచిన ఘటన ఆందోళన రేపుతోంది. లోక్ పైలెట్ అప్రమత్తంగా ఉండటంతో ఉత్తరప్రదేశ్‌లో నైనీ జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది.
బిలాస్‌పూర్ రుద్రపూర్ మధ్య రైలు పట్టాలపై ఓ భారీ ఇనుప స్తంభాన్ని లోకోపైలెట్ గుర్తించి అత్యవసర బ్రేకులు వినియోగించి బండిని ఆపారు. వెంటనే రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇనుప స్తంభం తొలగించడంతో జనశతాబ్ది రైలు సురక్షింగా గమ్యం చేరుకుంది.
కొందరు దుండగులు రైలు ప్రమాదాలు సృష్టించాలని చేస్తున్న ప్రయత్నాలు గత నెల రోజులుగా వెలుగు చూస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ దారుణాలు బయటపడుతున్నాయి. దీనిపై కేంద్ర నిఘా సంస్థలు దుండగులను గుర్తించే పనిలో పడ్డాయి. దీని వెనుక విదేశీ శక్తుల హస్తం ఏమైనా ఉందా అనే కోణంలోనూ విచారణ సాగుతోంది.