1947లో అప్పటి పరిస్థితుల ప్రకారం భారత ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. భారత్ లేక పాకిస్తాన్‌లో చేరడం ఇష్టం లేని రాజసంస్థానాలు స్వతంత్రంగా ఉండిపోవచ్చు అనేదే ఆ ప్రకటన. దాన్ని సాకుగా తీసుకుని భారతదేశపు నడిగడ్డ మీద తను స్వతంత్ర రాజుగా ఉండిపోవచ్చునని నిజాం భావించాడు. నిజాం చరిత్ర మరో చారిత్రక వాస్తవాన్ని సైతం వెల్లడించింది. నిజాం రాజవంశం ఎల్లప్పుడూ ప్రతీ సామ్రాజ్యం ముందూ తల దించుకుంది. నిజాములు మొదట్లో మరాఠాలు, తర్వాత ఫ్రెంచ్ వారు, చివరిగా బ్రిటిష్ వారి ముందు తలవంచే ఉన్నారు, వారెప్పుడూ విధేయులైన సేవకులుగానే ఉన్నారు. ఆ ఆలోచనా ధోరణి ఎంత పరాకాష్టకు చేరిందంటే బ్రిటిష్ వారు భారత్ వదిలిపెట్టి పోతున్నప్పుడు, తమను నిస్సహాయులుగా వదిలేసి వెళ్ళిపోవద్దంటూ నిజామ్ బ్రిటిష్ వారిని వేడుకున్నాడు.
కాలంలో వేగంగా మారిపోతున్న సంఘటనల నేపథ్యంలో, తాను స్వతంత్రంగా ఉండడానికి నిజాం నవాబు మతం ముసుగులో ఎన్నో ప్రయత్నాలు చేసాడు. అతని ఇస్లాం మతోన్మాదం, క్రూరమైన రాజరికం ఎలాంటివో అతని సొంత మాటల్లోనే తెలుస్తుంది. ‘‘సలాతీనే సల్ప్, సబ్ హోగయే నజరే, అజల్ ఉస్మాన్ ముసల్మానోం కా తేరీ సల్తనత్ సే హై నిషాన్ బాకీ :: రాజకీయ మార్పుల వల్ల ఇస్లామిక్ సామ్రాజ్యాలు కుప్పకూలిపోయాయి కానీ ఓ ఉస్మాన్, నీ రాజ్యం ముస్లిములకు ప్రతీకగా నిలిచిపోయింది’’. ‘‘బందా నాఖుస్ హువా సున్‌కే నారా యే థకిబీర్‌జల్ జలా, ఆహి గయా రిష్తా యే జున్నార్‌పర్ :: శంఖాలు పూరించే శబ్దాలను అల్లాహో అక్బర్ నినాదాలు నిలిపివేసాయి, జందెం ధరించే జనాలకు నాశనం తప్పదు’’. తన రాజ్యాన్ని స్వతంత్ర భారతంలో విలీనం చేయడం తనకు, తన రాజరికానికీ అవమానకరమని నిజాం భావించాడు. రాజ్యాంగ విషయాల్లో సలహా కోసం మాలెకన్ అనే ప్రసిద్ధ న్యాయవాదిని ప్రత్యేకంగా పిలిపించాడు, అతనికి రోజుకు లక్ష రూపాయలు చెల్లించాడు.
హైదరాబాద్ సంస్థానంలోని ముస్లిం జనాభాలో ఇస్లామిక్ మతోన్మాదాన్ని రెచ్చగొట్టడానికి తన కుట్ర ప్రకారం ఏమేం చేయాలో అవన్నీ చేసాడు నిజామ్. తన రాజ్యం చుట్టూ స్వతంత్ర భారతదేశపు రాష్ట్రాలు ఉంటే ప్రమాదకరమని అతడు భావించాడు. దానికోసం తనకు ఒక ఓడరేవు కావాలని భావించాడు. దానికోసం పోర్చుగీసు ప్రభుత్వం నుంచి గోవాను కొనేయాలని ఆలోచించాడు కూడా. అయితే భారత ప్రభుత్వపు విధానం తన ప్రణాళికలకు పూర్తి విరుద్ధంగా ఉందని నిజాంకు అర్ధమైంది. అత్యంత శక్తివంతమైన భారత సైన్యంతో పోరాడడం అసాధ్యమని అతనికి అర్ధమైంది. అందుకే అతను ఇతరత్రా ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టాడు. అందులో భాగంగానే తన సైన్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేసాడు, వారికి గెరిల్లా యుద్ధతంత్రంలో శిక్షణ ఇప్పించాడు. విదేశాల నుంచి ఆయుధాలు దిగుమతి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అలాగే తమ సొంత కర్మాగారాల్లో మరిన్ని ఆయుధాలు తయారవుతూ ఉండేవి. అదే సమయంలో అతను రజాకార్ సైన్యాన్ని కూడా అభివృద్ధి చేసాడు. తన సంస్థానం సరిహద్దులను కాపలా కాయడానికి ప్రత్యేకంగా పఠాన్లను నియమించుకున్నాడు. వాయుమార్గంలో ఆయుధాలను రహస్యంగా దిగుమతి చేసుకోడానికి ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు. అతను బీదర్, వరంగల్, రాయచూర్‌లోని విమానాశ్రయాలను పునర్నిర్మించాడు. హైదరాబాద్‌లో ముస్లిం జనాభా హిందువుల జనాభాతో సమానం అవడం కోసం నిజాము ఇతర ప్రాంతాల్లోని ముస్లిములకు ఎన్నెన్నో హామీలు ఇచ్చి, వారిని తన సంస్థానానికి తీసుకొచ్చాడు. హిందువులలోని అగ్ర వర్ణాలు, హరిజనుల మధ్య కులవిభేదాలు రాజేసాడు. ఒకరికి వ్యతిరేకంగా మరొకరిని రెచ్చగొట్టి వదిలేసాడు. రజాకార్లు హత్యలు, గ్రామాల దోపిడీలు, గృహదహనాలు, మహిళలపై అత్యాచారాలతో బీభత్సమైన, భయంకరమైన వాతావరణాన్ని సృష్టించారు. నిజాం తన మంత్రివర్గంలో తనకు విధేయులైన హిందూ మంత్రులను కూడా చేర్చుకున్నాడు. భారత ప్రభుత్వం ఇచ్చిన అన్ని సానుకూల సంకేతాలనూ నిజాం నిరాకరించాడు. తన దుర్మార్గమైన పథకాలను కొనసాగించాడు.
కొన్నాళ్ళ తర్వాత హైదరాబాద్ ప్రధానమంత్రి మీర్ లాయక్ అలీ చేర్యాల పర్యటనకు వెళ్ళాడు. అక్కడ ఇమ్మడి రాజిరెడ్డి నాయకత్వంలో వేలాది గ్రామస్తులు లాయక్ అలీ దగ్గరకు వెళ్ళి రజాకార్ల ఘాతుకాల గురించి ఫిర్యాదు చేసారు. ఆయన వాళ్ళకు కలిసి ఉండండి అని క్లుప్తంగా చెప్పి పంపించేసాడు. మరో గతిలేని గ్రామస్తులు ఆత్మరక్షణ కోసం ఆయుధాలు సేకరించడం మొదలుపెట్టారు. వల్లపట్ల రామచంద్రరావు దేశ్‌ముఖ్ దగ్గరనుంచి ఫిరంగి సంపాదించారు. దాన్ని భైరవునిపల్లి బురుజు మీద అమర్చారు. పెద్దసంఖ్యలో ఫిరంగి గుళ్ళు సిద్ధం చేసారు. గ్రామంలోని కమ్మరులు ఇనపగుళ్ళు, ఇతర ఆయుధాలు తయారుచేసారు. బెక్కల్, ధూళిమెట్ట, తూరసల్, జాలపల్లి, కొండాపూర్, కుటిగల్, సోలిపూర్, అంకుశిపూర్ ఇంకా మరెన్నో గ్రామాలు తమ స్వీయ రక్షణ దళాలను తయారు చేసుకున్నాయి. ఆ కార్యకలాపాలు అన్నింటికీ భైరవునిపల్లి కేంద్రబిందువుగా నిలిచింది. దాంతో రజాకార్లు ఆ గ్రామం మీద దృష్టి కేంద్రీకరించారు.
భువనగిరి డిప్యూటీ కలెక్టర్ ఇక్బాల్ హషీమ్ భైరవునిపల్లి గ్రామస్తులను తిరుగుబాటుదారులుగా ప్రకటించాడు, వారిపై దాడికి సిద్ధమయ్యాడు. ఆ గ్రామస్తుల ధైర్య సాహసాలు తనకు బహిరంగ సవాల్ విసిరినట్టుగా భావించాడు. హషీమ్ ఆ గ్రామాలపై తన సాయుధ పోలీసు బలగాలతో శాంతి రక్షణ పేరిట విరుచుకుపడ్డాడు. కొడకండ్ల గ్రామంలో 40కంటె ఎక్కువమంది అమాయకులైన గ్రామస్తులను కాల్చి చంపాడు. తర్వాత తన 150మంది సాయుధ పోలీసుల దళంతో భైరవునిపల్లి చేరుకున్నాడు. అక్కడ బురుజు మీద కాపలా కాస్తున్న వారు పోలీసు దళం కదలికలను గమనించి భేరీలు మోగించారు. అక్కడ రెండు పక్షాల మధ్యా భారీ యుద్ధమే జరిగింది. గ్రామస్తుల ఫిరంగి నుంచి కురిసిన అగ్నివర్షం హషీమ్ బృందాన్ని ఘోరంగా దెబ్బతీసింది. దారుణంగా ఓడిపోయిన హషీమ్, ఆ గ్రామాన్ని సర్వనాశనం చేసి ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేసాడు. ఆ యుద్ధంలోని విజయంతో స్ఫూర్తి పొందిన భైరవునిపల్లి గ్రామస్తుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. రజాకార్ల సైన్యాన్ని సైతం నిర్భయంగా ఎదుర్కొంటామన్న నమ్మకం కలిగింది. కానీ వారు నిజామ్ సైన్యాన్ని ఎదుర్కొనగలరా? వాళ్ళు దానిగురించి పెద్దగా ఆలోచించలేదు. సైన్యం తమ గ్రామాన్ని చుట్టుముట్టిందని తెలిసినప్పుడు వాళ్ళు దగ్గరలోని అడవుల్లోకి పారిపోలేదు. తమ ప్రాణాలు కాపాడుకోవాలన్న ఆలోచన వారికి రాలేదు. అందుకే భైరవునిపల్లి గ్రామం పూర్తిగా విధ్వంసమైపోయింది.
ఆరోజు యథావిధిగా సూర్యోదయం అయింది. కాంతి అంతటా విస్తరిస్తోంది. బురుజు మీద కాపలా ఉన్న ఇద్దరు యువకులు మగుతం రామయ్య, భూమయ్య ఇద్దరికీ ఫిరంగి గుళ్ళు తగిలాయి. ఇద్దరూ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. బురుజు గోడలు, అక్కడ వారు దాచుకున్న సామగ్రి అన్నీ ధ్వంసమైపోయాయి. అది రజాకార్ల దాడి కాదని, సైన్యం విరుచుకుపడుతోందనీ, వారితో యుద్ధం చేసి ప్రయోజనం లేదనీ గ్రామస్తులకు అర్ధమైంది. గ్రామస్తులు బురుజు మీద నుంచి తెల్లజెండా ఎగురవేసారు. కానీ నిజాం సైన్యం ఫిరంగి కాల్పులు కొనసాగించింది. సైనికులు గ్రామంలోకి ప్రవేశించి అడవి జంతువుల కంటె దారుణంగా రెచ్చిపోయారు. కంటికి కనిపించిన ప్రతీ వ్యక్తినీ చంపేసారు. ఒకచోట వాళ్ళు పదిమంది పిల్లల మీదకు హ్యాండ్‌గ్రెనేడ్స్ విసిరి ఆ చిన్నారులను చంపేసారు. అప్పుడే ఒక బిడ్డను కన్న తల్లి సహా అమాయకులైన గ్రామస్తులు ఎందరినో ఊచకోత కోసారు. శవాలను గుర్తుపడుతున్నప్పుడు ఆ బిడ్డ ఇంకా కొనఊపిరితో బతికే ఉందని తెలిసింది. అలా, భైరవునిపల్లి గ్రామం నరరూప రాక్షసుల అత్యాచారానికి బలైపోయింది.