సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి అనంతరం వైసీపీని పలువురు అగ్ర, ప్రజాకర్షక నేతలు వీడుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మోపిదేవి వెంకటరమణ వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు సిద్ధమైనట్లు ప్రకటించారు. వైసీపీ తరఫున సంక్రమించిన రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని కూడా వదులుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. అధినేత ధోరణి, కోర్ కమిటీ పెద్దల అనాలోచిత నిర్ణయాలతోనే తాను వైసీపీని వీడుతున్నట్లు ఆయన ప్రకటించారు. తాజా మరో అగ్రనేత అదే తరహా ప్రకటన చేయడం వైసీపీ శ్రేణుల్లో కలవరం రేపుతోంది.
వైసీపీ ఆవిర్భావ సమయంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆ పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి , రాజీనామా ప్రకటించారు. ఈ నిర్ణయం ఇప్పటికిప్పుడు తీసుకున్నది కాకపోయినా అయినా తాజాగా వైసీపీ తో బంధాన్ని తెగతెంపులు చేసుకున్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కు బంధువుగా వీరాభిమాని అయిన బాలినేని వైసీపీ ఆవిర్భావం నుంచి వైఎస్ జగన్ తో ఉన్నారు. వైఎస్సార్ హయాంలో కూడా బాలినేని మంత్రిగా పనిచేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండున్నరేళ్ళ పాటు మంత్రిగాను పనిచేశారు. మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఆయన పదవికోల్పోయారు. అప్పటి నుంచి అదును దొరికినప్పుడల్లా వైసీపీ అధిష్టానంపై బాలినేని శ్రీనివాసరెడ్డి ఆగ్రహం, అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
ఎన్నికలకు ముందు ఆయన పార్టీని వీడుతారని, ఫ్యాన్ గుర్తుపై పోటీ చేసే అవకాశం ఆయనకు దక్కకుపోవచ్చు అనే చర్చ జరిగింది. పలుమార్లు అధినేత తో భేటీ అయి ప్రకాశం జిల్లా రాజకీయాలపై తీవ్రంగా చర్చించారు. కొన్ని సార్లు బాస్ తో భేటీ అయ్యే అవకాశం దక్కకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీ టికెట్ల కేటాయింపు సమయంలోనూ అధిష్టానంపై అలిగి హైదరాబాద్ వెళ్ళి పోయారు. ఆ సమయంలో ఆయన హైదరాబాద్ లో గుంటూరు కారం సినిమా చూస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ప్రకాశం ఎంపీ సీటు విషయంలో వైసీసీ అధినేతతో ఆయన తీవ్రంగా విభేదించినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. 2019లో ప్రకాశం ఎంపీగా వైసీపీ తరఫున నెగ్గిన మాగుంటకే మళ్లీ టికెట్ ఇస్తే పార్టీకి మేలు జరుగుతుందని ఆయన కోరినట్లు వార్తలొచ్చాయి. అయితే 2024లో మాగుంట సైకిల్ గుర్తుపై పోటీ చేసి విజయం సాధించారు. వైసీపీ తరఫున పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓటమి చెందారు. ఒంగోలు శాసనసభ స్థానం నుంచి పోటీ చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి టీడీపీ అభ్యర్థి చేతిలో పరాభావం చెందారు.
ప్రస్తుతం కూడా వైసీపీ కోర్ కమిటీతో బాలినేనికి పొసగడం లేదు. దీంతో ఆయన వేరు దారి చూసుకుంటున్నట్లు ప్రకాశం జిల్లా వైసీపీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు.
బాలినేని ఒంగోలు నియోజకవర్గం నుంచి ఐదు మార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. అభిమానులు వాసన్న గా పిలిచే బాలినేని అనుచరులు అంతా టీడీపీలోకి వెళ్ళిపోయారు.
జనసేన అగ్రనేత నాగబాబును బాలినేని కలిసినట్టు వార్తలు షికార్లు చేస్తున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా ఆయన జనసేనలో చేరే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ అగ్రనేత వైవీ సుబ్బారెడ్డి, బాలినేని లు వరుసకు బావాబామ్మర్దులు అవుతారు.