దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో ఆసియా మార్కెట్లు దూసుకెళ్లాయి. సెన్సెక్స్ 660 పాయింట్లు పెరిగి 83610 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 193 పాయింట్లు పెరిగి 25568 పాయింట్ల రికార్డును నమోదు చేసింది. అంతర్జాతీయగా ఫెడ్ నిర్ణయం స్టాక్ సూచీల పరుగునకు దారితీసింది.
సెన్సెక్స్ 30 సూచీలో 29 స్టాక్స్ లాభాల్లో ట్రేడవుతున్నాయి. టాటా మోటార్స్, ఐసిఐసిఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, ఎన్టీపీసీ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఒక్క బజాజ్ ఫిన్ సర్వ్ స్వల్ప నష్టాల్లో ట్రేడవుతోంది.
డాలరుతో రూపాయి మారకం విలువ 83.69 వద్ద ట్రేడవుతోంది. ముడిచమురు ధరలు భారీగా దిగివచ్చాయి. బ్యారెల్ ముడిచమురు 73.62 అమెరికా డాలర్లకు దిగివచ్చింది. ఇక గోల్డ్ ధరలు దూసుకెళుతున్నాయి. తాజాగా స్వచ్ఛమైన బంగారం ధర ఔన్సు 2589 అమెరికా డాలర్లకు చేరింది.