ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలోని పథకాల పేరు మారుస్తోంది. తాజాగా మరో పథకం పేరును మారుస్తూ ఏపీ ఎన్డీయే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
‘వైఎస్ఆర్ లా నేస్తం’ పథకం పేరును న్యాయ మిత్రగా మార్చింది. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి (ఎఫ్ఏసీ) వి. సునీత ఉత్తర్వులు జారీ చేశారు. మార్గదర్శకాలను త్వరలో జారీ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో వివరించారు.
న్యాయ మిత్ర పథకంలో భాగంగా జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ అందజేస్తారు.
ఇప్పటికే జగనన్న విద్యాకానుక పథకానికి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రగా, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలకు పోస్టు మెట్రిక్ స్కాలర్ షిప్, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధిగా, జగనన్న గోరు ముద్దను డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా రాష్ట్రప్రభుత్వం మార్చింది. జగనన్న ఆణిముత్యాలు పథకాన్ని అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా, వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకాన్ని చంద్రన్న పెళ్లి కానుకగా, వైఎస్ఆర్ విద్యా వసతి పేరును ఎన్టీఆర్ విద్యావసతిగా గా మార్చారు. జగన్ సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరును సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రోత్సాహకాలుగా, జగనన్న శాశ్వత భూహక్కు – భూరక్షణ పథకాన్ని ఏపీ రీ సర్వే ప్రాజెక్టుగా కూటమి సర్కార్ మార్పు చేసింది.