ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖకు బ్రాండ్ అంబాసిడర్‌గా మనూ భాకర్ వ్యవహరిస్తారు. ఆ మేరకు కేంద్ర మంత్రి శర్బానంద సోనోవాల్ ప్రకటించారు. ఇటీవల పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో షూటింగ్ విభాగంలో భారత్‌కు రెండు పతకాలు సాధించడంతో మనూ భాకర్‌కు దేశవ్యాప్తంగా ఆదరణ విపరీతంగా పెరిగింది. ఆమె తండ్రి ఓ మెరైన్ ఇంజనీర్ కావడం విశేషం.
‘‘ఒక మెరైన్ సెయిలర్ కుమార్తె మనూ భాకర్ ఇప్పుడు జల రవాణా శాఖకు బ్రాండ్ అంబాసిడర్ కావడం భారతదేశపు మారిటైమ్ సెక్టార్‌లోని ప్రతీ సభ్యుడికీ గర్వకారణం. షూటింగ్‌లో ఆమె సాధించిన విజయాలకు కారణం సమయ పాలన, క్రమశిక్షణ, పట్టుదల, అణకువ. ఆమె కుటుంబానికి నౌకారంగపు నేపథ్యం ఉండడం వల్ల ఆమెకు అందిన విలువలే అవి’’ అని శర్బానంద సోనోవాల్ చెప్పుకొచ్చారు.
వివిధ రంగాల్లో మహిళల విజయాలను గుర్తించి వేడుక చేసుకునే కార్యక్రమంలో మంత్రి ఆ ప్రకటన చేసారు. ఆ సందర్భంగా పలువురు మహిళలను మంత్రి సన్మానించారు. లెఫ్టినెంట్ కమాండర్ వార్తికా జోషి ఐఎన్ఎస్‌వి తారిణి మీదున్న భారతీయ సిబ్బందిలో మొట్టమొదటి మహిళా స్కిప్పర్. సోనాలీ బెనర్జీ ఇండియన్ మెర్కంటైల్ మెరైన్‌లో మొట్టమొదటి మెరైన్ ఇంజనీర్. కెప్టెన్ టీనా జోయ్ జెఎం బాక్సీ గ్రూప్ చెన్నయ్ శాఖ జనరల్ మేనేజర్. రూపాలి రాజ్ జోషి ఇండియన్ రిజిస్ట్రార్ ఆఫ్ షిప్పింగ్‌లో సర్వేయర్. వారితో పాటు పారాలింపియన్ క్రీడాకారిణులు తులసిమతి మురుగేశన్, మనీషా రామదాస్‌లను కూడా మంత్రి సన్మానించారు.