మహారాష్ట్రలోని భివాండిలో వినాయక నిమజ్జనంపై ముస్లిములు దాడి చేసారు. గత (మంగళవారం) రాత్రి జరిగిన ఆ ఘటన స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఘూఘట్ నగర్ నుంచి పెద్ద వినాయక విగ్రహాన్ని నిమజ్జనం కోసం కోసం తీసుకువెడుతుండగా జరిగిన దాడిలో పలువురు గాయపడ్డారు.
గణేశుడి ఊరేగింపు వంజర్పట్టీ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిందుస్తానీ మజీద్ ప్రాంతంలోకి వచ్చేసరికి అక్కడ కొంతమంది వ్యక్తులు ఊరేగింపు మీదకు రాళ్ళు విసిరారు. ప్రత్యేకించి వినాయకుడి విగ్రహాన్ని లక్ష్యం చేసుకుని రాళ్ళు రువ్వారు. దాంతో ఊరేగింపులో పాల్గొంటున్న వారికి, మజీద్ ప్రాంత స్థానికులకూ మధ్య వివాదం చెలరేగింది. అది కాస్తా హింసాత్మకంగా మారింది.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, ప్రశాంతంగా సాగుతున్న వినాయకుడి ఊరేగింపు హిందుస్తానీ మజీద్ చేరువలోకి వచ్చేసరికి మజీదు వైపు నుంచి రాళ్ళు రువ్వారు. దానివల్ల వినాయకుడి మూర్తి దెబ్బతింది. దాంతో ఊరేగింపులో పాల్గొంటున్న భక్తుల ఆగ్రహానికి అంతే లేకుండా పోయింది. ఆ గొడవ కొద్ది నిమిషాల్లోనే పెద్ద వివాదవంగా మారింది. రెండు పక్షాలూ కొట్టుకున్నాయి.
రాళ్ళు రువ్వడం ద్వారా రెచ్చగొట్టి, వివాదానికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఊరేగింపు నిర్వహించిన గణేశ మండల్ డిమాండ్ చేసింది. వినాయకుడి విగ్రహాన్ని దెబ్బ తాకించినవారిని అరెస్ట్ చేసేవరకూ నిమజ్జనం చేసే ప్రసక్తే లేదంటూ ఆందోళన చేసింది. విగ్రహంపై దాడికి కారకుడంటూ ఒక వ్యక్తిని పోలీసులకు పట్టిచ్చారు. ఈ గొడవ నేపథ్యంలో హఫీజ్ దర్గా దగ్గర ముస్లిములు పెద్దసంఖ్యలో చేరారు. దాంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు అదనపు బలగాలను మోహరించారు.
స్థానిక పోలీసులు రంగంలోకి దిగి లాఠీఛార్జి చేసారు. దాంతో పలువురు గాయపడ్డారు. ఆ గందరగోళంలో కొంతమంది వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సంఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఊరేగింపు మొదట్లో ప్రశాంతంగా సాగుతోందని, ఒక్కసారిగా రాళ్ళు రువ్విన ఘటనతోనే పరిస్థితి మొత్తం మారిపోయిందనీ అదనపు పోలీస్ కమిషనర్ ధ్యానేశ్వర్ చవాన్ ధ్రువీకరించారు. సంఘటనలో ప్రమేయం ఉన్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
గణేశ నవరాత్రులు, వినాయక నిమజ్జనం సందర్భంగా ఈ యేడాది మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ఊరేగింపుల మీద దాడులు జరిగాయి. మంగళవారం రాత్రి లగావ్ జామోద్లోని చుభారా ప్రాంతంలో వినాయక నిమజ్జనం మీద రాళ్ళు రువ్వారు. సుమారు అరగంట పాటు జరిగిన దాడిలో పలువురు గాయపడ్డారు. బుల్దానా ప్రాంతంలో కూడా అటువంటి సంఘటనే చోటు చేసుకుంది.