తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న షేక్ జానీ బాషా అలియాస్ జానీ మాస్టర్ తన వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తున్న యువతిని లైంగికంగా వేధించిన ఘటన లవ్ జిహాద్ కేసు అని బీజేపీ మహిళా మోర్చా తెలంగాణ అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి ఆరోపించారు. యువతికి ఐదేళ్ళ పాటు నరకం చూపించడంతోపాటు వేధింపులు, దాడులకు పాల్పడటం, మతం మారాలంటూ ఒత్తిళ్ళకు గురిచేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు.
హిందూ అమ్మాయిని ట్రాప్ చేసినట్లు ఎఫ్ఐఆర్‌లో స్పష్టంగా నమోదు చేసినా కేసును నీరుగార్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారా అని ఆమె మండిపడ్డారు. జానీ మాస్టర్ నెల్లూరులో ఉన్నాడని తెలిసినా ఇంతవరకూ అరెస్ట్ చేయకపోవడాన్ని తప్పుపట్టారు. ఆ ఘటనకు కొందరు సినీ పరిశ్రమ పెద్దలతో పాటు అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయని ఆందోళన చెందారు. జానీ మాస్టర్‌కు గతంలోనూ నేరచరిత్ర ఉందని, 2015లో ఓ కాలేజీలో మహిళపై దాడి కేసులో 2019లో మేడ్చల్ కోర్టు ఆరు నెలల జైలుశిక్ష విధించిన సంగతిని స్వయంగా పోలీసులే వెల్లడించారని ఆమె గుర్తు చేశారు. తాజాగా మరోసారి మహిళా డ్యాన్సర్‌పై, మైనర్‌గా ఉన్నప్పటి నుంచీ వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు చేసినా ఈ కేసును పట్టించుకోకపోవడాన్ని మహిళా మోర్చా తీవ్రంగా ఖండిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాగం ఎవరి ఒత్తిళ్లకూ లొంగకుండా కేసు విచారించి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బిజెపి మహిళా మోర్చా ఆధ్వర్యంలో బాధిత మహిళలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని శిల్పా రెడ్డి హెచ్చరించారు .
తెలంగాణలో లవ్‌జిహాద్ ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని శిల్పారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, హోంశాఖను సైతం నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే పరిస్థితికి పూర్తి బాధ్యత వహించాలనీ డిమాండ్ చేశారు.