అమెరికా న్యూయార్క్ మెల్‌విల్లేలోని బిఎపిఎస్ స్వామి నారాయణ్ మందిర్‌ను ధ్వంసం చేసిన ఘటన చోటు చేసుకుంది. కొందరు గుర్తుతెలియని దుండగులు మందిరం మీద విద్వేష రాతలు రాసి, ఆలయాన్ని ధ్వంసం చేసిన ఘటన స్థానిక కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం జరిగింది.
న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ జనరల్ ఆ విద్వేష దాడిని తీవ్రంగా ఖండించారు. ‘‘మెల్‌విల్లేలోని స్వామి నారాయణ్ ఆలయ ధ్వంసం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఈ వ్యవహారం విషయంలో కాన్సులేట్ కార్యాలయం స్థానిక భారతీయ సమాజానికి అండగా నిలిచింది. అమెరికా అధికారులతో ఈ విషయాన్ని ప్రస్తావించాం. ఆ నేరానికి పాల్పడిన దుండగులపై కచ్చితమైన చర్య తీసుకోవాలని కోరాం’’ అంటూ కాన్సులేట్ జనరల్ ‘ఎక్స్’లో పోస్ట్ చేసారు.
ఆ సంఘటనపై మందిర నిర్వాహకులు స్పందించారు. ‘‘దురదృష్టవశాత్తు ఇదేదో అరుదుగా జరిగిన సంఘటన కాదు. ఇటువంటి దాడులు ఉత్తర అమెరికా అంతటా వివిధ హిందూ ఆలయాలపై జరుగుతూనే ఉన్నాయి’’ అని ఆవేదన వ్యక్తం చేసారు. సంఘటన గురించి తెలియగానే స్థానిక అధికారులను సంప్రదించాము. ఇలాంటి విద్వేష నేరాలకు పాల్పడుతున్న వారిని కనుగొనడానికే దర్యాప్తు జరుగుతోంది. మేం అధికారులతో కలిసి పనిచేస్తున్నాం’’ అంటూ స్వామి నారాయణ్ మందిర్ నిర్వాహకులు ఒక ప్రకటన విడుదల చేసారు.
నిక్ లాలోటా, టామ్ సువోజీ వంటి కొందరు అమెరికా ప్రజా ప్రతినిధులు, స్థానిక ప్రవాస భారతీయుల ప్రతినిధులతో సమావేశమై, మందిర్ దగ్గర ప్రార్థనలు చేసారు. ‘‘బిఎపిఎస్ మందిర్‌లో జరిగిన సంఘటన చాలా బాధాకరం. హిందువులపై ద్వేషాన్ని రెచ్చగొట్టే చర్య. దానికి వ్యతిరేకంగా స్థానిక, రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి నాయకులందరూ కలిసి వచ్చారు. శాంతి, పరస్పర గౌరవం, ఐకమత్యం ఉండాలని సందేశమిచ్చారు. విద్వేష భావనలకు వ్యతిరేకంగా మేమంతా మీతో కలిసి ఉంటాం’’ అంటూ నిక్ లాలోటా హిందువులను ఊరడించారు.
‘‘ఇటువంటి చర్యలు అమెరికా విధానం కాదు, మన దేశపు మౌలిక విలువలకు పూర్తి విరుద్ధమైనవి. ఇటువంటి విధ్వంసాలను, విద్వేషాన్ని కొంతమంది నాయకులు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతున్నారు’’ అని టామ్ సువోజీ అభిప్రాయపడ్డారు.
జరిగిన సంఘటనపై దర్యాప్తు జరిపించాలని అమెరికా న్యాయ విభాగాన్ని హిందూ అమెరికన్ ఫౌండేషన్ కోరింది. వచ్చే వారాంతంలో సమీపంలోని నసావ్ కౌంటీలో ప్రవాస భారతీయులు ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారని, దానికి ముందు ఇలాంటి సంఘటన వారిలో భయాందోళనలు కలిగిస్తోందనీ హెచ్ఎఎఫ్ చెప్పింది. కొద్దికాలం క్రితమే కాలిఫోర్నియా, కెనడాల్లోనూ స్వామినారాయణ్ మందిరాల వద్ద ఇటువంటి విధ్వంసం జరిగిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఖలిస్తానీ ఉగ్రవాది గుర్‌పత్వంత్‌సింగ్ పన్నూ ఇటీవల హిందూ సంస్థలపై దాడులు చేస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్ట్ చేసిన సంగతిని కూడా గుర్తుచేసింది.
2024 జులైలో ఖలిస్తానీ అతివాదులు ఆల్బెర్టా ప్రొవిన్స్‌లోని ఎడ్మాంటన్ సిటీలో స్వామి నారాయణ్ మందిర్‌పై దాడి చేసారు. 2023 సెప్టెంబర్‌లో సర్రే బ్రిటిష్ కొలంబియాలోని శ్రీమాతా భామేశ్వరీ దుర్గాదేవి సొసైటీ మందిరంలోనూ భారత వ్యతిరేక ఖలిస్తానీ నినాదాలు రాసారు. 2023 ఫిబ్రవరిలో మిసిసాగాలోని రామమందిరంలోనూ భారత వ్యతిరేక రాతలు రాయడమే కాకుండా మందిరం పైనా దాడి చేసారు. 2023 జనవరిలో కెనడా ఒంటారియోలోని బ్రాంప్టన్ సిటీలో ఖలిస్తానీ ఉగ్రవాదులు గౌరీశంకర మందిరంపై భారత వ్యతిరేక నినాదాలు రాసారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు