చర్చిల నిర్మాణానికి కోట్ల విలువైన భూములను అక్రమంగా కాజేసారని బిజెపి ‘వారధి’ కార్యక్రమంలో ఫిర్యాదులు అందాయి. అధికారులకు లంచాలు ఇచ్చామని, తమను ఎవరూ ఏమీ చేయలేరనీ ఆక్రమణదారులు సవాల్ చేసారంటూ ఫిర్యాదుదారులు ఆరోపించారు.
కడప జిల్లా మైదుకూరు మండలం నంద్యాలపేట గ్రామంలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న 11ఎకరాల ప్రభుత్వ భూమిని ఆర్సిఎం చర్చి బిషప్ గాలి బాలిరెడ్డి, ఫాదర్ సంబుటూరు సురేష్, గుర్రం రవిచంద్ర, ప్రభుత్వ ఉపాద్యాయుడు రవీంద్రబాబు ఆక్రమణలకు పాల్పడ్డారని ఫిర్యాదుదారులు చెప్పారు.
గతంలో ఆర్డీవో, ఇతర అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఫిర్యాదుదారుడు నాగ మల్లేష్ లిఖిత పూర్వకంగా తెలిపారు. అధికారులకు లంచాలిచ్చామని, తమను ఎవరూ ఏమీ చేయలేరని, అక్టోబర్లో చర్చి ప్రారంభం కానున్నట్లు చెప్పారని ఫిర్యాదుదారుడు ఆరోపించారు.
ఎన్టీఆర్ జిల్లా జి కొండూరు మండలం వెలగలేరు గ్రామంలో హనుమాన్గిరి గట్టు మీదున్న అయ్యప్ప దేవాలయంలో క్రైస్తవులు కొందరు శిలువలు ఏర్పాటు చేశారని, వాటిని తొలగించాలనీ కె నాగమల్లేశ్వరరావు, సిహెచ్ నరేంద్ర ఫిర్యాదు చేశారు.
మంగళవారం జరిగిన వారధి కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ, బిజెపి అధికార ప్రతినిధి యామినీ శర్మ, వారథి సమన్వయ కర్త కిలారు దిలీప్ తదితరులు పాల్గొన్నారు.