వంటనూనెలపై దిగుమతి సుంకం పెంచిన నేపథ్యంలో దేశీయంగా ధరలు పెరుగుతాయనే వార్తలపై కేంద్రప్రభుత్వం స్పందించింది. సంబంధిత అసోసియేషన్లకు కీలక సూచనలు చేసింది.
దిగుమతి సుంకం పెరుగుదలను సాకుగా చూపి ధరలు పెంచవద్దని తేల్చిచెప్పింది. తక్కువ సుంకానికి ఇప్పటికే దిగుమతి చేసుకున్న వంట నూనెల నిల్వలు సరిపడా మొత్తం దేశంలో అందుబాటులో ఉన్నాయని తెలిపింది. దాదాపు 30 లక్షల టన్నుల నూనె నిల్వ ఉందని, ఈ స్టాక్ మరో 45 నుంచి 50 రోజులకు సరిపోతుందని వివరించింది.కాబట్టి ధరలు పెంచవద్దని స్పష్టం చేసింది.
చౌక దిగుమతుల కారణంగా దేశీయంగా పండే నూనె గింజల ధరలు పడిపోతున్నాయి. దీంతో స్థానిక రైతులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయదారులకు మేలు చేసేందుకు కేంద్రప్రభుత్వం వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని పెంచింది. పామాయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్ పై 12.5 శాతం నుంచి 32.5 శాతానికి పెంచింది. వీటిపై అగ్రికల్చర్ సెస్ కూడా ఉంటుంది.