హిందువులు మెజారిటీగా ఉన్నప్పటికీ హైదరాబాద్ సంస్థానంలో వారికి కనీసం ప్రాథమిక హక్కులైనా లేకుండా చేసాడు నిజామ్. హైదరాబాద్‌ను అతను ఒక సార్వభౌమ ఇస్లామిక్ రాజ్యంగా మార్చేయడానికి ప్రయత్నించాడు. లార్డ్ రీడింగ్ పాలనా కాలం నుంచీ బ్రిటిష్ ప్రభుత్వానికి నిజామ్ విశ్వాసపాత్రుడైన స్నేహితుడిగా ఉన్నాడు. ఆ స్నేహబాంధవ్యాల కారణంగానే నిజామ్ ‘స్వతంత్ర హైదరాబాద్ దేశం’ పాట పాడడం మొదలుపెట్టాడు.
స్వతంత్ర భారతదేశంలో విదేశీ పరిపాలనలో ఉన్న హైదరాబాద్ ప్రజలు స్వతంత్రం కోసం ఆందోళనలు మొదలుపెట్టారు. నిజామ్ రాజ్యవ్యవస్థలను మరింత కఠినతరం చేసాడు. ప్రజలను అణగదొక్కేసే తన నిరంకుశ పాలనకు మరింత పదును పెట్టాడు. తననూ, తన నియంతృత్వ పాలననూ సమర్ధించే మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్’ అనే మతసంస్థ నిజామ్కు అండగా నిలబడింది. ‘ముస్లిములు పాలకులు, హిందువులు పాలితులు. ముస్లిముల శక్తిసామర్థ్యాలకు, అధికారానికీ నిజామ్ ప్రతీక’ అని ఎంఐఎం ప్రచారం చేసింది. ఆ సంస్థ తన మతసైన్యమైన రజాకార్లను రంగంలోకి తీసుకువెళ్ళింది. హైదరాబాద్ రాష్ట్రంలోకి ఇతర ప్రాంతాల నుంచి ముస్లిములను తీసుకొచ్చి. రాష్ట్రంలో ముస్లిముల జనాభాశాతాన్ని గుణాత్మకంగా పెంచేసాడు. మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) అనే ముస్లిం సాంస్కృతిక మతసంస్థ, నిజామ్ ప్రభుత్వంతో చేతులు కలిపి దురహంకార ధోరణితో ప్రవర్తించి, 1930లలో హైదరాబాద్ రాష్ట్రంలో మతఘర్షణలను ప్రజ్వరిల్లజేసింది. ఆ సంస్థ లక్ష్యాల ప్రకారం, దాని వ్యవస్థాపకుడైన బహదూర్ యార్ జంగ్, నిజామ్ను సార్వభౌమత్వానికి వ్యక్తిరూపం నుంచి నామమాత్రపు స్థాయికి తగ్గించేసాడు. ‘అధికారం పాలకుడి దగ్గర కాదు, అతన్ని పాలించడానికి అనుమతించిన ముస్లిం విశ్వాసుల సమూహం చేతిలో ఉంటుంది’ అని ప్రచారం చేసాడు. అలా, మజ్లిస్ తర్కం ప్రకారం హైదరాబాద్‌ను ముస్లిం రాజ్యంగా ప్రకటించాలి, ఆ రాజ్యపు సార్వభౌమత్వంలో ప్రతీ ముస్లిమునూ భాగస్వామి, వాటాదారును చేయాలి.
బహదూర్ యార్ జంగ్ 1944లో చనిపోయాడు. అతని వారసుడిగా కాసిం రజ్వీ వచ్చాడు. అతనే మజ్లిస్‌కు అర్ధసైనిక విభాగమైన ‘రజాకార్’ దళాన్ని ఏర్పాటు చేసాడు. రజ్వీ నాయకత్వంలోనే మజ్లిస్ మరింత అతివాద సంస్థగా మారింది. హైదరాబాద్ భారత్‌లో చేరడాన్ని వ్యతిరేకించింది మజ్లిసే. దానికి బదులు, ఇంకా ఆలస్యం కాకముందే పాకిస్తాన్‌తో సంబంధాలు పెట్టుకోవాలంటూ నిజామ్కు కాసిం రజ్వీయే సలహా ఇచ్చాడు. అదెంత మతిమాలిన సలహాయో అర్ధమైనందున, నిజామ్ రజ్వీని పిచ్చివాడనీ, నీచ దుర్మార్గుడనీ నిందించాడు.
సిడ్నీ కాటన్ వంటి విదేశీయుల సహాయంతో నిజామ్ విమానాల ద్వారా ఆయుధాలను రహస్యంగా సేకరించడం మొదలుపెట్టాడు. హైదరాబాద్ సంస్థానంలోని కర్మాగారాలు అన్నీ ఆయుధాల తయారీ కేంద్రాలుగా మారిపోయాయి. అప్పుడు నిజాం డబుల్‌గేమ్ మొదలుపెట్టాడు. ఒకవైపు తన సైన్యాన్ని నిర్మించుకుంటూనే, భారత ప్రభుత్వంతో శాంతి చర్చలు ప్రారంభించాడు. అదే సమయంలో ‘జిహాద్’ పేరిట ద్వేషాన్ని ప్రచారం చేస్తూ హిందువులపై దాడులు ప్రారంభించాడు. ప్రజలను లూటీ చేయడం, మహిళలపై అత్యాచారాలు చేయడంతో రజాకార్లు సామాన్య ప్రజలను భయభీతులను చేసారు.
రజాకార్లు తెలంగాణ ప్రాంతంలోని గ్రామాలన్నింటిపైనా దాడులు చేసారు, ప్రజలను దోచుకున్నారు, ఆడవాళ్ళపై మానభంగాలు చేసారు, జనాలను ఊచకోత కోసారు. బీభత్సమైన పరిపాలన చేసారు. అంతటా భయమే వ్యాపించిన వాతావరణంలో సైతం కొన్నిగ్రామాల్లో ప్రజలు ధైర్యం తెచ్చుకుని పాలకులను వ్యతిరేకించారు. దాంతో హిందువులను తప్పుదోవ పట్టించేందుకు నిజాం ప్రభుత్వం ‘శాంతి కమిటీలు’ ప్రారంభించింది. వాటిలో హిందువులను సభ్యులుగా చేసి వారిని మభ్యపెట్టింది. ఉదాహరణకి, జనగామలో పరిశ్రమల విభాగం సూపర్వైజర్ ఎంఎన్ రెడ్డి, వ్యవసాయ విభాగం సూపర్వైజర్ శఠగోపాచార్యులు శాంతి కమిటీలో సభ్యులుగా ఉన్నారు. కానీ అలాంటి హిందూ సభ్యులు రజాకార్లకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేస్తే వారి జీవితాలకు ముప్పు వాటిల్లుతుంది. నిజానికి ఆ మాయ కూడా స్పష్టంగానే ఉండేది. ఒకానొక శాంతి కమిటీ సమావేశంలో ఒకసారి శఠగోపాచార్యులు రజాకార్ల భయంకరమైన అరాచకాలను తీవ్రంగా ఖండించారు. ఆ మరునాడే ఆయనను జనగామ రోడ్డు మీద కాల్చి చంపేసారు. ఎంఎన్ రెడ్డి కొంచెం మెత్తటి స్వరంలో రజాకార్ల గురించి ఫిర్యాదు చేస్తే ఆయనను చంపేస్తామని బెదిరించారు.
తిప్పర్తి పట్టణంలో ముస్లిం అధికారులు ప్రజలు అందరితోనూ ఆయుధాల వాడకాన్ని అభ్యాసం చేయించేవారు. వాళ్ళు తుపాకి కాల్చడం నేర్పించే పేరు మీద హిందువులతో తోటి హిందువులను కాల్పించేవారు. అదే సమయంలో నిజామ్, శాంతి కమిటీల ఏర్పాటు ద్వారా ప్రజలను రక్షిస్తున్నామని ప్రచారం చేసుకునేవాడు. ఆ ‘శాంతి’ని కనుగొనడం చాలా భయానకంగా ఉండేది. ఆ విషయాన్ని స్వయంగా శాంతి కమిటీ సభ్యుడైన ఎంఎన్ రెడ్డి ఇలా చెప్పుకొచ్చారు. ఒకసారి ఆయన కొడకండ్ల-రంగాపూర్ రహదారి మీద ప్రయాణిస్తున్నారు. ఆ ప్రాంతం ఐననూరు పోలీస్ స్టేషన్‌కి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ ఒక చింతచెట్టుకు 5శవాలు వేలాడుతున్నాయి. ఆయన వెంటనే దగ్గర్లో ఉన్న గ్రామానికి వెళ్ళి అక్కడివాళ్ళను ఆ శవాల గురించి అడిగాడు. అవి ఐదుగురు బ్రాహ్మణుల శవాలు. అంతకుముందురోజు ఒక అంతిమ సంస్కార కార్యక్రమానికి వెళ్ళిన ఏడుగురు బ్రాహ్మణులు ఆ దారిలో తిరిగి వస్తున్నారు. వాళ్ళని రజాకార్ల ముఠా పట్టుకుంది. వారిలో ఇద్దరు బ్రాహ్మణులు పారిపోయారు. ఆ రజాకార్లు ఆ బ్రాహ్మణులను భారత ప్రభుత్వం ఏజెంట్లు అని తమకు తామే నిర్ధారించేసారు, వాళ్ళని చింతచెట్టుకు సజీవంగా వేలాడదీసి, వారి కింద మంట పెట్టారు. అలా బతికుండగానే వాళ్ళను కాల్చారు. ఆ ఐదుగురు బ్రాహ్మణులూ చనిపోయాక వారి శవాలను ఆ చెట్టు మీదే వదిలిపెట్టారు. అది ప్రాంతంలోని హిందువులకు హెచ్చరిక అన్నమాట. అమానుషమూ, అతి భయానకమూ అయిన ఆ హత్యలను చూసిన గ్రామస్తులు భయంతో వణికిపోయారు.
నిజాం రాజ్యం, రజాకార్లు హైదరాబాద్ సంస్థానంలో చేసిన దారుణాలు 1857 మొదటి స్వతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ సైన్యాధికారి నీల్ చేసిన ఘాతుకాలను మించిపోయాయి. నీల్ భారతీయులను చెట్టుకు వేలాడదీసి ఫిరంగులతో కాల్చి చంపేవాడు. అతను జనాలను వేలాడదీసి మంటపెట్టిన సజీవంగా కాల్చిన దాఖలాలు లేవు. బతికుండగానే జనాలను నిలువునా కాల్చిన ఘనత రజాకార్లది మాత్రమే. రాక్షసులు సైతం అలాంటి బీభత్సమైన ఘాతుకాలకు పాల్పడి ఉండరు. రజాకార్లు, ప్రభుత్వ అధికారులు కలిసి గ్రామాల మీద రాత్రి వేళల్లో దాడులు చేసేవారు. ఎలాంటి పశ్చాత్తాపమూ లేకుండా దోచుకునేవారు. ఆడవారు చెవులకు ముక్కుకు పెట్టుకునే ఆభరణాలను అలాగే లాక్కునేవారు. చెవులూ ముక్కూ కోసుకుపోయి రక్తం వస్తున్నా ఆ ఆడవారు కిమ్మనకూడదు. అలా రక్తంతో తడిసిన నగలను, లూటీ చేసిన ధాన్యం, ఇతర సంపదలను తీసుకుపోయి శాంతి కమిటీ కార్యాలయంలో దాచిపెట్టేవారు. వాటిని మర్నాడు ఉదయం వాటాలు వేసుకుని పంచుకునేవారు. స్వయంగా తన కార్యాలయంలోనే అలాంటి పనులు జరిగేవని ఎంఎన్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. అలాంటి సంఘటనల గురించి ఫిర్యాదు చేసినా ఏ ప్రయోజనమూ ఉండేది కాదు. ఎంఎన్ రెడ్డి వంటి హిందూ అధికారులు ఎంతో దుఃఖపడేవారు, కానీ వారు నిస్సహాయులు. హిందువులు సైతం అటువంటి చర్యలను ఖండించినప్పుడు నిజాం ప్రభుత్వం మాత్రం వాటిని సమర్ధించుకునేది. ఆందోళనలను అణచివేసి శాంతిని నెలకొల్పుతున్నామనే పేరు మీద హిందువులను మరింత అణగదొక్కేది.
మొహమ్మద్ అలీ జిన్నా 1947లో హైదరాబాద్ వచ్చాడు. అప్పుడు భారీ బహిరంగ సభలో ఎన్నో రెచ్చగొట్టే ప్రకటనలు చేసాడు. ‘కోడి మెడ విరిచినట్లు హిందువుల మెడలు విరిచేస్తాం. వాళ్ళని ముల్లంగి దుంప తరిగినట్టు ముక్కలు ముక్కలుగా నరికేస్తాం’ అంటూ ప్రసంగాలిచ్చాడు. దాంతో రజాకార్లు మరింత పేట్రేగిపోయారు.
ఆనాటి సమావేశ మందిరం వేలాది మంది ముస్లిములు అరుస్తున్న ఇస్లామిక్ నినాదాలతో మార్మోగిపోయాయి. మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ నాయకుడు కాసిం రజ్వీని అతని అనుచరులు ‘అలీ జనాబ్ సిద్దిక్ మిల్లత్’, ‘సలార్-ఎ-ఆజమ్’ వంటి విశేషణాలతో పిలిచారు. వారి మధ్య నుంచి, రెండువైపులా సాయుధులైన రజాకార్లు రక్షిస్తుండగా కాసిం రజ్వీ వేదిక వైపు కదిలాడు. ‘షాహీ ఉస్మాన్ జిందాబాద్’, ‘ఆజాద్ హైదరాబాద్ పాయంబాద్ సిద్దిక్ మిల్లత్ కాసిం రజ్వీ’ అనే నినాదాలు హోరెత్తిపోయాయి. ఆరోజు కాసిం రజ్వీ చెలరేగిపోయి ప్రసంగించాడు. హైదరాబాద్ స్వతంత్రంగానే ఉంటుందని తను నిశ్చయించేసాడంటూ రెచ్చిపోయి మాట్లాడాడు. నిజామ్ భారత ప్రభుత్వంతో యథాస్థితి ఒప్పందం చేసుకున్నాడని చెబుతూ రెసిడెన్సీ బిల్డింగ్ గురించి కూడా చెప్పాడు. ఆ సమయంలో ఆ భవనంలో భారత ప్రభుత్వం తరఫున చర్చలకు వచ్చిన కెఎం మున్షీ ఆ భవనంలో ఉన్నారు. మున్షీ వెంటనే ఖాళీ చేయకపోతే ఆ భవనాన్ని నేలమట్టం చేసేస్తామంటూ బెదిరించాడు. రజ్వీ ఉద్రేకపూరిత ప్రసంగంతో సభలో ఉన్న ముస్లిములు రెచ్చిపోయి నినాదాలు చేసారు. దాంతో, రెసిడెన్సీ బిల్డింగ్‌ను ఖాళీ చేసి బొలారంలోని ఇంటికి వెళ్ళిపోవాలంటూ కెఎం మున్షీకి నిజామ్ ఉత్తర్వులు పంపించాడు. ఆ తర్వాత రెసిడెన్సీ బిల్డింగ్‌ను పోలీస్ ప్రధాన కార్యాలయంగా మార్చారు. ఆ పరిణామం రజ్వీ వ్యూహం మాత్రమే కాదు, రజ్వీకి గొప్ప రాజకీయ విజయం కూడా.