జమ్మూకశ్మీర్‌లో 370 అధికరణం రద్దు, రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మూడు దశల పోలింగ్‌లో ఇవాళ మొదటి దశ పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 90 నియోజకవర్గాలకు గాను 24 నియోజకవర్గాల్లో ఇవాళ పోలింగ్ జరుగుతోంది. ఈ ఉదయం 9 గంటల వరకూ 11.1శాతం పోలింగ్ నమోదయింది.
2014 తర్వాత, అంటే పదేళ్ళ తర్వాత జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు ఇప్పుడే జరుగుతున్నాయి. రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించాక ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి. రాజ్యాంగంలోని 370వ అధికరణం రద్దు తర్వాత జమ్మూకశ్మీర్, లద్దాఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. మళ్ళీ రాష్ట్రహోదా ఈ ఎన్నికల్లో ప్రధానాంశమైంది. ఎన్నికల తర్వాత రాష్ట్రహోదా పునరుద్ధరిస్తామని బీజేపీ వాగ్దానం చేసింది. పొత్తులో పోటీ చేస్తున్న కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు కూడా అదే వాగ్దానం చేసాయి.
ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్న మిగతా ప్రధాన పార్టీలు మెహబూబా ముఫ్తీకి చెంది పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ, అబ్దుల్ గనీలోన్కు చెందిన పీపుల్స్ కాన్ఫరెన్స్, గులాం నబీ ఆజాద్‌కు చెందిన డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ, అల్తాఫ్ బుఖారీకి చెందిన అప్నీ పార్టీ. మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే నిషిద్ధ జమాతే ఇస్లామీ సంస్థ ఈ ఎన్నికలద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించింది. ఆ సంస్థ నేరుగా అభ్యర్ధులను నిలబెట్టకపోయినా కొందరు అభ్యర్ధులకు మద్దతిస్తోంది.
ఇవాళ పోలింగ్ జరుగుతున్న నియోజకవర్గాల్లో 7 స్థానాలు అనంతనాగ్‌లో, 4 స్థానాలు పుల్వామాలో, 3 స్థానాలు కిష్త్వర్లో, 3 స్థానాలు దోడాలో, 3 స్థానాలు కుల్గావ్లో, 2 స్థానాలు షోపియన్‌లో, 2 స్థానాలు రాంబాణ్లో, 2 స్థానాలు బనిహాల్‌లో ఉన్నాయి. వీటిలో 8 నియోజకవర్గాలు జమ్మూలోను, 16 కశ్మీర్ లోయ ప్రాంతంలోనూ ఉన్నాయి.
పుల్వామాలో ఎన్నికల పట్ల అత్యంత ఆసక్తి నెలకొంది. అక్కడ పీడీపీ నేత వహీదుర్ రెహమాన్ పారా గతంలో తమ పార్టీకే చెందిన, ప్రస్తుతం నేషనల్ కాన్ఫరెన్స్‌లో ఉన్న మొహమ్మద్ ఖలీల్ బంద్‌తో పోటీ పడుతున్నాడు. మూడుసార్లు ఎమ్మెల్యే అయిన బంద్ ఇప్పుడు ఉగ్రవాద వ్యతిరేక చట్టాల కింద నమోదైన కేసులో బెయిల్ మీద ఉన్నారు. జమాతే ఇస్లామీ మద్దతిచ్చిన అవామీ ఇత్తెహాద్ పార్టీకి చెందిన తలత్ మజీద్ కూడా బరిలో ఉన్నాడు. ఒకప్పుడు పీడీపీ కంచుకోట అయిన పుల్వామాలో ఇప్పుడా పార్టీ ఎదురీదుతోంది.
శ్రీగుఫారా-బిజ్బెహారా నియోజకవర్గంలో పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ మాటిసారి పోటీ చేస్తోంది. ఆమె నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్ధి బషీర్ అహ్మద్ షా, బిజెపి అభ్యర్ధి సోఫీ యూసుఫ్‌లతో తలపడుతోంది.
కుల్గావ్లో కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్‌లు మద్దతిచ్చిన సీపీఎం అభ్యర్ధి యూసుఫ్ తరిగామీ పోటీ చేస్తున్నాడు. అక్కడ మరో అభ్యర్ధికి జమాతే ఇస్లామీ మద్దతిస్తోంది.
జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలకు ముందు బీభత్సం సృష్టించడదానికి ఉగ్రవాదులు ప్రయత్నించారు. గత కొద్దికాలంలో ఉగ్రవాద సంఘటనలు పెచ్చుమీరాయి. గతవారంలోనే మూడు ఎన్కౌంటర్లు జరిగాయి. వాటిలో ఇద్దరు ఆర్మీ వ్యక్తులు, కనీసం ఐదుగురు వ్యక్తులూ ప్రాణాలు కోల్పోయారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యావద్దేశం మొత్తం జమ్మూకశ్మీర్ పరిణామాలను ఆసక్తిగా చూస్తోంది.