వినాయకచవితి పర్వదినాన్ని విశ్వహిందూ పరిషత్ థాయ్‌లాండ్ విభాగం వైభవంగా నిర్వహించింది. బ్యాంకాక్‌లోని నిముబిత్ర్ ఎరీనాలో సెప్టెంబర్ 14, 15 తేదీల్లో జరిపిన ఈ పండుగ వేడుకలో పెద్దసంఖ్యలో భారతీయులతో పాటు స్థానిక ప్రజలు, పర్యాటకులు కూడా పాల్గొన్నారు.
ఈ యేడాది బ్యాంకాక్‌తో పాటు పట్టాయాలో కూడా వినాయక చవితి జరుపుకోవడం విశేషం. విశ్వహిందూ పరిషత్ ఉపాధ్యక్షుడు దేవ్ కె సింగ్ నేతృత్వంలో పట్టాయాలోని భారతీయులు గణేశ పూజా కార్యక్రమాలు సంబరంగా జరుపుకున్నారు. నిమజ్జన కార్యక్రమం సెప్టెంబర్ 16న జరిగింది.
ఆ కార్యక్రమంలో భారతీయులతో పాటు థాయ్ ప్రజలు, థాయ్‌లాండ్ పర్యటనకు వచ్చిన ఇతర దేశాల పర్యాటకులు కూడా పాల్గొన్నారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే కార్యక్రమాలను చూసి అబ్బురపోయారు.
విశ్వహిందూ పరిషత్ థాయ్‌లాండ్ విభాగం ప్రతీయేటా గణేశ ఉత్సవం జరుపుతూంటుంది. వినాయక చవితి సందర్భంగా ఎన్నో సాంస్కృతిక ప్రదర్శనలు, ఆధ్యాత్మిక సంగీత ఆలాపన కార్యక్రమాలు, ఇతర సేవా కార్యక్రమాలూ నిర్వహిస్తారు.
థాయ్ సంప్రదాయంలో గణపతి భగవానుడిని ఫ్రా ఫీ కానెట్ అని పిలుస్తారు. ఆ భగవంతుణ్ణి థాయ్ వాసులు అమితంగా ఆరాధిస్తారు. అందుకే, వినాయక చవితి సంబరాల్లో స్థానిక ప్రజలు సైతం ఉత్సాహంగా పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఇక వేలాది ప్రవాస భారతీయులు ఆ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో తమ ప్రతిభ చాటారు. భారత్, శ్రీలంక, టిమోర్ లెస్టే వంటి దేశాల దౌత్యకార్యాలయాల ప్రతినిధులు, థాయ్‌లాండ్ ప్రభుత్వ ప్రతినిధులు, స్థానిక వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు.
పట్టాయాలో జరిగిన వేడుకలకు నగర మేయర్, జిల్లా మేజిస్ట్రేట్, సిటీకౌన్సిల్ సభ్యులు స్వయంగా హాజరయ్యారు. పండుగ వేడుకలు విజయవంతంగా జరగడానికి పూర్తి సహకారం అందించారు. అంతే కాకుండా వినాయక చవితి సంబరాలను ప్రతీ యేటా పట్టాయాలో నిర్వహించాలని కోరారు. దానికి విశ్వహిందూ పరిషత్ బాధ్యులు సంతోషంగా అంగీకరించారు.
నిమజ్జన కార్యక్రమం కూడా గొప్పగా జరిగింది. బ్యాంకాక్‌లో గణపతిని రథం మీద ఊరేగింపుగా తీసుకువెళ్ళి నిమజ్జనం చేసారు. వయోభేదం లేకుండా పిల్లలూ పెద్దలూ అందరూ ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు.
విశ్వహిందూ పరిషత్ థాయ్‌లాండ్‌లో 17సంవత్సరాలుగా గణేశ ఉత్సవాలు నిర్వహిస్తోందని విహెచ్‌పి థాయ్‌లాండ్ అధ్యక్షురాలు వైశాలి తుషార్ ఉరుంకర్ చెప్పారు. ‘‘హిందూధర్మంలోని ఆచార వ్యవహారాలు, సంప్రదాయాల సౌందర్యాన్ని చూపడం ద్వారా ఇక్కడ వివిధ జాతుల మధ్య దూరాలను తగ్గించడానికి, ఆత్మీయతలను పెంచడానికీ విహెచ్‌పి థాయ్‌లాండ్ కృషి చేస్తోంది. ఈ పండుగ సంతోషాన్నీ, ఆత్మీయతనూ పంచే గొప్ప పండుగ. ఈ సంవత్సరం వేలమంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవాలయాలు, కమ్యూనిటీలు, ఇళ్ళలో వ్యక్తిగత స్థాయిలో కూడా వినాయక చవితి సంబరాలు జరుపుకోవడం సంతోషకరం’’ అని వైశాలి చెప్పుకొచ్చారు.