దేశంలో పలు రాష్ట్రాల్లో నిందితుల ఇళ్లపైకి బుల్డోజర్లు పరుగులు పెట్టించడంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. నేరాలు నిర్ధారణ కాక ముందే అనుమానితల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేయడాన్ని హీరోయిజంగా చూపవద్దని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. మార్గదర్శకాల తయారీపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అక్టోబరు ఒకటి వరకు బుల్డోజర్ న్యాయం ఆపాలని జస్టిస్ బి.ఆర్. గవాయ్, కె.బి.విశ్వనాథన్‌ల బెంచ్ ఆదేశించింది. కోర్టు తీర్పు వచ్చే వరకు బుల్డోజర్లు ఆపడం వల్ల వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదన్నారు.
ఈ నెలలో ఇప్పటికే చోటుచేసుకున్న రెండు బుల్డోజర్ చర్యలపై సుప్రీంకోర్టు మండిపడింది. పలు రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా ఈసీకి నోటీసులు ఇస్తామంటూ సర్వోన్నత న్యాయస్థానం చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది.
రైల్వే స్థలాలు, చెరువులు, కుంటలు, నదుల ఆక్రమణల తొలగింపునకు మాత్రం ఈ ఆదేశాలు వర్తించవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జామద్ ఉలేమా హింద్ సంస్థ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ తీర్పు వెలువరించింది. కూల్చివేతలకు 60 రోజుల ముందే నోటీసులు ఇవ్వాలంటూ ఈ సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు విచారణ జరిపి కీలక ఆదేశాలు జారీ చేసింది.