దేశంలో మెరుగైన రాజకీయ స్థిరత్వం ఉందని కేంద్రహోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అయిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వ నిర్ణయాలతో దేశం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.
దేశవ్యాప్తంగా త్వరలో జనగణన చేపడతామన్న అమిత్ షా, గత పదేళ్ళలో అంతర్గత భద్రతకు ఎన్డీఏ ప్రభుత్వం పటిష్టంగా కృషి చేసిందన్నారు. మోదీ 3.0 ప్రభుత్వంలో 11లక్షల మంది లఖ్పతి దీదీ పథకం ద్వారా లబ్ధి పొందారని వెల్లడించారు.
ప్రధాని మోదీ నాయకత్వంలో ప్రాచీన, ఆధునిక విద్యావిధానంతో కూడిన కొత్త విద్య విద్యార్థులకు అందుతుందన్నారు.
ఎన్డీయే మూడోసారి అధికారంలోకి వచ్చాక ప్రత్యేకంగా పలు విలువైన ప్రాజెక్టులకు రూ.3 లక్షల కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి కావడంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా వివిధ మంత్రిత్వశాఖలు, బీజేపీ వివరణాత్మక ప్రణాళికను రూపొందించాయన్నారు. ఇందులోభాగంగా సేవా పఖ్వాడా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారన్నారు. ఈ కార్యక్రమాలు నేటి నుంచి అక్టోబరు 2 వరకు కొనసాగుతాయన్నారు.