దేశంలో జరుగుతోన్న వరుస రైలు ప్రమాదాలు, కుట్రలపై కేంద్ర హోం మంత్రి ఘాటుగా స్పందించారు. కుట్రలు ఎక్కువ కాలం దాగవన్నారు. కుట్ర కోణం వెలికితీసేందుకు విచారణ జరుగుతోందన్నారు. గత కొంత కాలంగా రైలు పట్టాలపై గ్యాస్ సిలెండర్లు, సైకిల్లు, ఇనుప వస్తువులు, పెద్ద బండరాళ్లు పెట్టి ప్రమాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ హోం మంత్రి వ్యాఖ్యానించారు. ఇలాంటి ఘటనలు ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, గుజరాత్, పంజాబ్, తెలంగాణ, బిహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో చోటుకుంటున్నాయన్నారు.
దేశంలో లక్షా 10 వేల కిలోమీటర్ల రైల్వే నెట్ వర్క్ ఉంది. దీన్ని బలోపేతం చేసేందుకు త్వరలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు అమిత్ షా వెల్లడించారు. మోదీ మూడో సారి ప్రధాని అయ్యాక 34 రైలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయంటూ కొందరు కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శల్లో నిజం లేదన్నారు.
రైల్వేల అభివృద్దికి కేంద్రం కట్టుబడి ఉందని, ప్రధాని మోదీ ఇటీవల పలు రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించినట్లు అమిత్ షా గుర్తుచేశారు. రైలు ప్రమాదాలు తగ్గించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.