పవిత్ర ధనుర్మాసంలో ఈ ఏడాది తిరుప్పావై ప్రవచనాలు చెప్పేందుకు విద్యాంసుల నుంచి అంగీకారపత్రాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఆహ్వానిస్తోంది. ఈ ఏడాది డిసెంబరు 16 నుంచి 2025 జనవరి 13 వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో తిరుప్పావై ప్రవచనాలు చెప్పేందుకు శ్రీవైష్ణవ సిద్ధాంతం తెలిసిన సమర్థులైన విద్వాంసుల నుంచి అంగీకారపత్రాలను ఆహ్వానిస్తున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. 2015 నుంచి 2023 వరకు తిరుప్పావై ప్రవచనాలు చెప్పిన వారు ఈ ఏడాది కూడా అంగీకారం తెలపాలని కోరింది.
హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతీ ఏటా ధనుర్మాసంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో తిరుప్పావై ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అర్హులు అక్టోబరు 15, సాయంత్రం 5 గంటలలోపు ”ప్రత్యేకాధికారి, ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు, శ్వేత భవనం, టీటీడీ, తిరుపతి-517502” అనే చిరునామాకు అంగీకారపత్రాలు పంపాలని ప్రకటనలో పేర్కొంది.
నమూనా అంగీకారపత్రాన్ని www.tirumala.org వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఇతర వివరాలకు టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల కార్యాలయంలో సిబ్బందిని లేదా 9676120226, 8978734947 నంబర్లను కార్యాలయ వేళల్లో సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు.