భారతదేశానికి బ్రిటిష్ వారినుంచి స్వతంత్రం 1947 ఆగస్టు 15న వచ్చింది. అంతకుముందే దేశ విభజన నిర్ణయం జరిగిపోయింది. దాంతో దేశంలోని రాజసంస్థానాలకు భారత్‌లో చేరాలా లేక పాకిస్తాన్లో చేరాలా నిర్ణయించుకునే అవకాశం ఇచ్చారు. హోంమంత్రి సర్దార్ వల్లభ్ భాయ్ ఝవేర్‌భాయ్ పటేల్, ఆయన విశ్వసనీయ కార్యదర్శి ప్రముఖ ఐసిఎస్ అధికారి వి.పి మేనన్లకు రాజసంస్థానాలను ఒక దేశంగా సమైక్యం చేసే బాధ్యత ఇచ్చారు. సమర్ధమైన నాయకత్వ ప్రతిభ, అద్భుతమైన వ్యూహచతురతతో సర్దార్ పటేల్, విపి మేనన్ ద్వయం అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. ఒక్క యేడాది లోపే 562 రాజసంస్థానాలు భారత్‌లో విలీనానికి సిద్ధమయ్యాయి.
మూడు సంస్థానాలు మాత్రం ఇంకా భారత్‌లో విలీనం కాలేదు. అవి కశ్మీర్, జునాగఢ్, హైదరాబాద్. వాటిలో హైదరాబాద్ పరిమాణంలో చాలా పెద్దది. హైదరాబాద్ సంస్థానం విస్తీర్ణం యునైటెడ్ కింగ్డమ్ విస్తీర్ణం కంటె ఎక్కువ. ఆ సంస్థానంలో చాలా ప్రాంతాలుండేవి. ఇప్పుడు వేర్వేరు రాష్ట్రాలుగా ఉన్న మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌లలోని భాగాలు హైదరాబాద్ సంస్థానంలో ఉండేవి. అప్పటికి హైదరాబాద్ సంస్థానాన్ని నిజామ్ అసఫ్‌జాహీ వంశంలోని ఏడవ రాజైన నిజామ్ ఉస్మాన్ అలీఖాన్ పరిపాలిస్తుండేవాడు.
నిజానికి ఉస్మాన్ అలీఖాన్ తోలుబొమ్మ మాత్రమే, నిజమైన అధికారం అంతా నిజాం సలహాదారుల్లో ఒకడైన కాసిం రిజ్వీ చేతుల్లో ఉండేది. ఇవాళ మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) పార్టీగా చెప్పుకుంటున్న సంస్థకు చెందిన శక్తివంతమైన నాయకుడు. తన సొంత అనుచరులతో ప్రైవేటు సైన్యాన్ని నిర్వహించేవాడు. ఆ సైనికులనే రజాకార్లు అని పిలుస్తారు. ఆ సైన్యంలో గరిష్టంగా 2లక్షల మంది రజాకార్లు ఉండేవారని సమాచారం. హైదరాబాద్ సంస్థానం షరియా చట్టం అమల్లో ఉండే ప్రత్యేక దేశంగా ఉండాలి లేదా పాకిస్తాన్లో విలీనం అవాలని రజాకార్లు భావించేవారు.
హైదరాబాద్ సంస్థానాన్ని రజాకార్లు పరిపాలిస్తున్నప్పటికీ, ప్రజలు వారి పాలనను తీవ్రంగా వ్యతిరేకించేవారు. సామాన్య ప్రజానీకం, ఆ సంస్థానం ఎట్టిపరిస్థితుల్లోనూ భారత్‌లో విలీనం కావాలని కోరుకునేవారు. ఇంక పాకిస్తాన్ హైదరాబాద్ నుంచి 1500 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఆ దేశంలో విలీనం కావడం తర్కబద్ధమే కాదు.
మొదటినుంచీ హింసతోనే ప్రజలను నిర్బంధించి ఉంచిన రజాకార్లు, ప్రజాభిప్రాయం తమకు వ్యతిరేకంగా ఉండడంతో బలప్రయోగంతో వారిని అణిచేయాలని భావించారు. సంస్థానంలో రక్తపాతమే సృష్టించారు. ఇస్లామిక్ రాజ్యం సృష్టించాలన్న భావనతో ఉన్న రజాకార్లు, సంస్థానంలోని ముస్లిమేతరులను లక్ష్యంగా చేసుకుని అమానుష హింసాకాండకు పాల్పడ్డారు. అమాయక ప్రజల ప్రాణాలు తీసారు. మహిళలు, బాలికలపై వారు పాల్పడిన అత్యాచారాలకు అంతేలేదు. బెంగాల్లో డైరెక్ట్ యాక్షన్, లేదా పంజాబ్ విభజన సమయంలో జరిగిన హింసకు హైదరాబాద్ సంస్థానంలో జరిగిన హింస ఎంతమాత్రం తక్కువది కాదు. రజాకార్ల అమానుష హింసాకాండను నిజాం అనుమతించాడు.
భారత ప్రభుత్వం మొదట హైదరాబాద్‌తో యథాస్థితి ఒప్పందం చేసుకోడానికి సిద్ధపడింది. దాని ప్రకారం భారత సైన్యం హైదరాబాద్ సరిహద్దులకు వెలుపల మోహరిస్తుంది. ఇక హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలను నిజాం పాలకులు స్వేచ్ఛగా బ్రతకనీయాలి. కానీ, కాసిం రిజ్వీ చేతిలోని రజాకార్ల భయంకరమైన హింసాకాండ మీద విశ్వాసంతో, భారత ప్రభుత్వం ప్రతిపాదనను నిజాం తిరస్కరించాడు. సంస్థానంలోని ముస్లిమేతర జనాభా మీద రజాకార్ల అత్యాచారాలు రోజురోజుకూ పెరిగిపోతుండడంతో సైనిక బలగాల మోహరింపు లేకుండా యథాస్థితి ఒప్పందం సాధ్యం కాదు. దాంతో చివరికి సర్దార్ పటేల్‌కు బలప్రయోగం చేయక తప్పలేదు. 1948 సెప్టెంబర్ 13న ‘ఆపరేషన్ పోలో’ పేరుతో మిలటరీ ఆపరేషన్స్ మొదలయ్యాయి. భారత సైన్యం ధాటికి రజాకార్లు యుద్ధక్షేత్రాన్ని విడిచి పరారయ్యారు. ఎట్టకేలకు 1948 సెప్టెంబర్ 17 సాయంత్రం 5గంటలకు నిజాం యుద్ధ విరమణ ప్రకటించాడు. హైదరాబాద్ సైన్యాధ్యక్షుడు మేజర్ జనరల్ సయ్యద్ అహ్మద్ అల్ ఎద్రూస్ లొంగిపోతున్నట్లు ప్రకటించాడు. భారత సైన్యాధికారి మేజర్ జనరల్ జయంతొ నాథ్ చౌధురి ఆ లొంగుబాటును అంగీకరించాడు. దాంతో హైదరాబాద్ అధికారికంగా భారత్‌లో విలీనమైంది.
హైదరాబాద్ మూసీనది ఒడ్డున ఉంది. ఆ నగరానికి ఆ పేరు పెట్టింది గోలుకొండ ఐదవ కుతుబ్‌షాహీ సుల్తాన్ అయిన మొహమ్మద్ కులీ (1580-1612). 1687 సెప్టెంబర్ 21న గోల్కొండ రాజ్యం మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్ పరిపాలనలోకి వెళ్ళింది. ఔరంగజేబ్ సైనికాధికారి గజియుద్దీన్ ఖాన్ ఫిరోజ్ జంగ్ కుమారుడైన మీర్ కమ్రుద్దీన్ చిన్ కిలిచ్ ఖాన్ హైదరాబాద్ రాజ్యానికి పరిపాలకుడయ్యాడు.
మొగల్ సామ్రాజ్యపు ఆఖరి అవశేషం హైదరాబాద్. భౌగోళికంగా కీలక ప్రాంతంలో ఉన్న ఆ ప్రాంతానికి రాజకీయంగానూ ప్రాధాన్యం ఉంది. ఉత్తరాన సెంట్రల్ ప్రొవిన్సెస్, పశ్చిమాన బొంబాయి, తూర్పు-దక్షిణాల్లో మద్రాస్ ప్రొవిన్స్‌లు ఉన్నాయి. 82వేల చదరపు మైళ్ళ విస్తీర్ణం, సుమారు 1.60 కోట్ల జనాభా, రూ.26 కోట్ల వార్షికాదాయం, సొంత కరెన్సీ ఉన్న సంస్థానంగా ఉండేది. అందువల్ల హైదరాబాద్ సంస్థానానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉండాలని నిజామ్ ఎప్పుడూ కోరుకునేవాడు. కానీ బ్రిటిష్ పాలకులు మిగతా రాష్ట్రాల కంటె హైదరాబాద్‌ను విభిన్నంగా ఎప్పుడూ పరిగణించలేదు.
హైదరాబాద్ సంస్థానంలో 85శాతం జనాభా హిందువులే ఉండేవారు. కానీ వారికి సాధారణ, పోలీసు, ఆర్మీ ఉద్యోగాల్లో అవకాశాలు ఉండేవి కావు. అవి కేవలం ముస్లిములకు మాత్రమే దక్కేవి. నిజాం ఏర్పాటు చేసిన లెజిస్లేటివ్ అసెంబ్లీలో 132 మంది సభ్యులు ఉంటే వారిలో అత్యధికులు ముస్లింలు మాత్రమే.
1947 జూన్ 3న బ్రిటిష్ ప్రభుత్వం భారత్, పాకిస్తాన్ అనే రెండు దేశాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాక హైదరాబాద్ నిజామ్, అసఫ్‌జాహీ 7 అయిన ఉస్మాన్ అలీఖాన్ ఒక ఫర్మానా జారీ చేసాడు. భారత్, పాకిస్తాన్లకు చెందిన రాజ్యాంగ నిర్మాణ సభలకు ఎలాంటి ప్రతినిధినీ పంపబోవడం లేదని, హైదరాబాద్ స్వతంత్ర సార్వభౌమ దేశంగా ఉంటుందనీ ప్రకటించాడు. అంతేకాదు, బేరార్ ప్రాంతాన్ని నిజామ్కు అప్పగించాలి, హైదరాబాద్‌కు డొమినియన్ హోదా ఇవ్వాలి అన్న తన డిమాండ్లను లార్డ్ మౌంట్‌బాటన్‌తో చర్చించడానికి ఛతరీ నవాబ్ నేతృత్వంలో ఒక బృందాన్ని పంపించాడు.
బేరార్ ప్రాంతం సెంట్రల్ ప్రొవిన్సెస్లో కలిసి ఉంది, దాన్ని మార్చి హైదరాబాద్ సంస్థానంలో కలపాలంటే ఆ ప్రాంత ప్రజల అనుమతి అవసరం. అలాగే బ్రిటిష్ ప్రభుత్వం ఏ ప్రతిపాదననైనా భారత్ లేదా పాకిస్తాన్ అనే రెండు డొమినియన్ల ద్వారా మాత్రమే అనుమతిస్తుంది కాబట్టి హైదరాబాద్‌కు డొమినియన్ హోదా ఇవ్వడం సాధ్యం కాదు. అలా సాంకేతిక పరిమితులను కారణంగా చూపి నిజామ్ రెండు డిమాండ్లనూ మౌంట్‌బాటన్ తిరస్కరించాడు. ఛతరీ నవాబ్ బృందం హైదరాబాద్‌కు తిరుగుముఖం పట్టింది.
భారతదేశపు ఆఖరి వైస్రాయ్, స్వతంత్ర భారత్ మొదటి గవర్నర్ జనరల్ అయిన లార్డ్ మౌంట్‌బాటన్, హైదరాబాద్ భారత్‌లో చేరుతుందన్న ఆశాభావంతో ఉన్నాడు. అందువల్ల హైదరాబాద్ సంస్థానంలో అత్యున్నత స్థానాల్లో అధికారంలో ఉన్న, జనాభా పరంగా 15శాతం మాత్రమే ఉన్న మైనారిటీలను విద్యావంతులను చేయడానికి కొంత అదనపు సమయం కావాలని కోరాడు.
ఆగస్టు 8న నిజాం మరోసారి మౌంట్‌బాటన్‌కు లేఖ రాసాడు. హైదరాబాద్ సంస్థానం భారత్‌లో చేరబోదని, కానీ భారత్‌తో కొన్ని షరతులతో కూడిన ఒప్పందం చేసుకోడానికి సిద్ధంగా ఉందనీ చెప్పాడు. ఆ షరతులేంటంటే.. హైదరాబాద్ సంస్థానానికి దాదాపు స్వతంత్ర సార్వభౌమ దేశంలాంటి స్వయంప్రతిపత్తి కావాలి. భారత్‌కు పాకిస్తాన్‌తో యుద్ధం జరిగితే అలాంటి పరిస్థితుల్లో భారత్‌తో కూటమిగా చేరాల్సిన అవసరం లేని అధికారం కావాలి. ఎన్నో దఫాల చర్చల తర్వాత 1947 నవంబర్‌లో హైదరాబాద్ సంస్థానం భారత డొమినియన్తో యథాస్థితి ఒప్పందం మీద సంతకం చేసింది. హైదరాబాద్‌లో భారత సైనిక బలగాలను ఉంచడం తప్ప మిగతా అన్ని ముందస్తు ఒప్పందాలనూ కొనసాగిస్తూ ఆ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే మిలిటెంటు రజాకార్ల సహకారంతో నిజాం స్వతంత్ర ఇస్లామిక్ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాడు. రజాకార్ల ఆగడాలతో మెజారిటీ ప్రజలైన హిందువుల జీవితాలు నరకప్రాయమైపోయాయి. రాక్షస రజాకార్లు, నిజాము పీడను అణచివేయడానికి భారతదేశానికి హైదరాబాద్ స్టేట్ మీద చర్య తీసుకోవడం అనివార్యమైంది. ఆ సైనిక చర్య ఫలితంగా నిజామ్ భారత ప్రభుత్వానికి లొంగిపోయాడు, భారతదేశంలో విలీనం అవడానికి తుది సంతకం పెట్టాడు. అలా, హైదరాబాద్ సంస్థానం ఎట్టకేలకు భారతదేశంలో విలీనమైంది.