ఆర్జి కర్ ఆసుపత్రి డాక్టర్ హత్యాచారం ఘటనలో సీబీఐ, ఈడీ దూకుడు పెంచాయి. ఇప్పటికే ఆర్జి కర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను అరెస్ట్ చేసిన అధికారులు, తాజాగా ఆర్థిక అవకతవకల సమాచారంతో టీఎంసీ ఎమ్మెల్యే సుదీప్త రాయ్‌కు చెందిన కార్యాలయాలు, ఫామ్‌హౌసుల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఏకకాలంలో ఆరు చోట్ల సోదాలు చేస్తున్నట్లు ఈడీ అధికారి ఒకరు చెప్పారు. సుదీప్త బెంగాల్ హెల్త్ రిక్రూట్మెంట్ ఛైర్మన్‌గా కూడా చేస్తున్నారు. నియామకాల్లో భారీ అవినీతి జరిగినట్లు ఈడీ అధికారులకు అందిన సమాచారం మేరకు సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అరెస్టై జైల్లో ఉన్న సందీప్ ఘోష్ ఇచ్చిన సమాచారం మేరకు టీఎంసీ ఎమ్మల్యే నివాసాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
సీబీఐ, ఈడీ, ఐటి, ఎన్ఐఏ సంస్థలు కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలుగా మారాయని టీఎంసీ నేతలు విమర్శలు చేశారు. టీఎంసీ నేతలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్లు వారు ఆరోపించారు.
పాలీగ్రాఫ్ పరీక్షల్లోనూ ఆర్జి కర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ నిజాలు చెప్పడం లేదని సీబీఐ తెలిపింది. ఘోష్‌కు నార్కో ఎనాలసిస్ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఐ సిద్దమవుతోంది. డాక్టర్ హత్య కేసులో ఇప్పటికే ఓ నిందితుడిని అరెస్ట్ చేశారు. సాక్ష్యాలు మార్చేందుకు ప్రయత్నించిన కేసులో మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌ను అరెస్ట్ చేసి విచారిస్తున్న సంగతి తెలిసిందే.